హాట్‌టాపిక్‌గా అమితాబ్ ‘బుల్లితెర’ సీరియల్..!

Friday, June 7th, 2013, 09:00:52 PM IST


సామాజిక సమస్యలపై మరో టీవీ షో రాబోతుంది. ఆ మధ్య ‘సత్యమేవ జయతే’ అంటూ ఆమీర్ ఖాన్ జనాల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయగా.. ఇప్పుడు బిగ్ బీ అమితాబ్ వంత వచ్చింది. ఇన్నాళ్లూ రియాల్టీ షోలకే పరిమితమైన బిగ్ బీ తాజాగా సీరియల్ బాట పట్టారు. హోం ప్రోడక్షన్ లో అమితాబ్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ సీరియల్ కు క్రియేటివ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తుండటంతో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.

కౌన్ బనేగా కరోడ్ ప్రొగ్రాంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన అమితాబ్ ప్రస్తుతం సినిమాలతో బాలీవుడ్ ను.. గేమ్ షోలు, రియాల్టీ షోలతో బుల్లితెరని ఊపేస్తున్నారు. టీఆర్పీల్లోనూ అదరగొడుతున్నారు. అప్పుల నుంచి తేరుకొన్న తర్వాత లెక్కలేసుకోని సినిమాల్ని నిర్మిస్తోన్న బచ్చన్ ఏబీసీఎల్ పై ఇప్పుడు సీరియల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇక అమితాబ్ నటించబోతున్న ఈ సీరియల్ కు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ వహిస్తుండటంతో.. ఈ సీరియల్ పై విపరీతమైన అంచనాలున్నాయ్. నటుడిగా అమితాబ్ ఎన్ సైక్లోపీడియా అయితే.. దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ క్రియేటివ్స్ కే క్రియేటివ్. దేవ్ డీ దగ్గర్నుంచి గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ వరకు అనురాగ్ తీసిన ప్రతీ చిత్రం ఓ క్లాసిక్కే. వాస్తవికాంశాలతో అంతకన్నా సహజసిద్ధంగా సినిమాను తీసే అనురాగ్ కు బడా బడా హీరోలే సలాం అంటారు. అందుకే అనురాగ్- అమితాబ్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ తయారవుతుందంటే దాని ఔట్ పుట్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి పెరిగిపోయింది.

అలాగే మొన్నామధ్య ఓ సినిమా రిలీజ్ విషయంలో చిన్న విభేదాలు రావడంతో అనురాగ్- అమితాబ్ మధ్య సఖ్యత లేదంటూ వార్తలోచ్చాయి. బాంబేటాకీస్ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ ను అనురాగ్ చూపించిన విధానంపై కూడా పెద్ద చర్చే జరిగింది. అయితే తాము బానే ఉన్నామని.. మా ఇద్దరి ఎలాంటి విభేదాలు లేవని కశ్యప్- బచ్చన్ తేల్చిచెప్పారు. నేను అమితాబ్ ను ఎప్పుడూ ఎక్కడా విమర్శించలేదని అనురాగ్ వివరణ ఇవ్వగా.. అమితాబ్ కూడా అనురాగ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. గొడవలున్నాయనే కథనాలొచ్చిన తర్వాత వీరిద్దరి జత కట్టడం కూడా సీరియల్ పై అసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే సీరియల్ షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ ఏడాది చివర్లో ప్రసారమయ్యే అవకాశాలున్నాయి. మరి ఏడు పదుల వయసులో మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బిగ్ బీ నటిస్తున్న సీరియల్ ఎలా ఉండనుంది..? టీఆర్పీ విషయంలో బచ్చన్ సీరియల్ కొత్త రికార్డులు ఏమైనా సృష్టిస్తుందా అన్న విషయాలపైనే ఇప్పుడు బాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది.