వెంకీ-బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మూవీ?

Tuesday, September 25th, 2018, 07:46:12 PM IST

`బొమ్మ‌రిల్లు` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాతో భాస్క‌ర్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఫ్యామిలీ మూవీ అన‌గానే బొమ్మ‌రిల్లు సినిమాని ఎగ్జాంపుల్‌గా చెబుతారు. ఆ సినిమాతోనే `బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌`గా పాపుల‌ర‌య్యాడు. అంత గొప్ప సినిమా తీసిన భాస్క‌ర్ ఆ త‌ర్వాత అంతే చెత్త సినిమాలు తీసి పెద్ద షాకిచ్చాడు. త‌న‌వైన సెన్సిబిలిటీస్‌కి దూరంగా, మాస్ క‌థ‌ల‌తో మెప్పించేందుకు ప్ర‌య‌త్నించి ఫెయిల‌య్యాడు. అల్లు అర్జున్ ఛ‌రిష్మాతో `ప‌రుగు` ఆక‌ట్టుకున్నా, ఆ త‌ర్వాత అస‌లు భాస్క‌ర్ సినిమా ఏదీ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి. ఆ క్ర‌మంలోనే చ‌ర‌ణ్‌తో `ఆరెంజ్‌` లాంటి డిజాస్ట‌ర్ తీసి మార్కెట్ వ‌ర్గాల్లో మ‌రింత‌గా బ్యాడ్ అయ్యాడు. ఆరెంజ్ న‌ష్టాల‌తో నిర్మాత‌ నాగ‌బాబు భాస్క‌ర్‌పై ఓ ఆడియో వేదిక సాక్షిగా నిప్పులు చెర‌గ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చింది. ఆ త‌ర్వాత ఒంగోలు గిత్త‌, ఎందుకంటే ప్రేమంట లాంటి డిజాస్ట‌ర్లు భాస్క‌ర్‌ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. అదంతా గ‌తం అనుకుంటే.. 2016లో `బెంగ‌ళూరు డేస్` రీమేక్ `బెంగ‌ళూరు నాట్క‌ల్` పేరుతో అత‌డు తెర‌కెక్కించాడు. ఆ త‌ర్వాత చాలా గ్యాప్‌.

మ‌ధ్య‌లో ప‌లువురు హీరోల‌కు క‌థ‌లు వినిపించేందుకు ప్ర‌య‌త్నించినా అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి భాస్క‌ర్ క‌థ వినిపించినా ప‌న‌వ్వ‌లేదు. ఇన్నాళ్టికి మ‌ళ్లీ భాస్క‌ర్ పున‌రాగ‌మ‌నం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారి భాస్క‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్‌ని న‌మ్ముకున్నాడ‌ట‌. ఇటీవ‌లే ఓ లైన్ వినిపించి వెంకీతో ఓకే చేయించుకున్నాడ‌ని తెలుస్తోంది. లైన్ ఓకే చెప్పి, స్క్రిప్టును పూర్తిగా డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని వెంకీ సూచించార‌ట‌. ఇటీవ‌లే రామానాయుడు స్టూడియోస్ కాంపౌండ్‌లో భాస్క‌ర్ క‌నిపించార‌ని స్టూడియో వర్గాలు చెబుతున్నాయి. ఈసారి భాస్క‌ర్‌కి సీరియ‌స్ ఎటెంప్ట్ చేస్తున్నాడ‌ట‌. తాడో పేడో తేల్చుకోవాల‌నే ఎంత‌గానో క‌స‌ర‌త్తు చేసి వెంకీని క‌లిశాడ‌ట‌.

2019 సెకండాఫ్‌లో వెంకీతో సెట్స్ కెళ్లే ఛాన్సెస్ ఉన్నాయ‌ని తాజాగా తెలుస్తోంది. అనీల్‌రావిపూడి `ఎఫ్‌2` రిలీజ్ అనంత‌రం భాస్క‌ర్ సినిమాకి సంబంధించిన ఇత‌ర‌ప‌నులు ప్రారంభమ‌య్యే ఛాన్సుందిట‌. అయితే వెంకీ క్యూలో ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు ఉన్నారు. జైల‌వ‌కుశ ఫేం బాబితో `వెంకీ మామ‌` ప్రీప్రొడ‌క్ష‌న్ లో ఉంది. త్రివిక్ర‌మ్‌, త్రినాథ‌రావు న‌క్కిన క‌థ‌ల్ని వెంకీ ప‌రిశీలించాడు. వీళ్ల నుంచి పూర్తి స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి. అలాగే తేజ ఇదివ‌ర‌కూ ఓ క‌థ వినిపించాడు. వీళ్లంద‌రి మ‌ధ్య‌లో భాస్క‌ర్ స్క్రిప్టు ఎంత‌వ‌ర‌కూ మెప్పిస్తుందో చూడాలి. ఇది ఓకే అయితేనే అత‌డికి చివ‌రిసారిగా మ‌రో ఛాన్సు ద‌క్కిన‌ట్టు!