జ‌వాన్ల‌ కోసం చిరంజీవి యువ‌త‌ కోటి విరాళం

Tuesday, February 27th, 2018, 08:41:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి పిల్లికి భిక్షం వేయ‌ర‌ని, మెగా హీరోలంతా ఇంతేన‌ని ప్ర‌చారం సాగిస్తాయి కొన్ని మెగా వ్య‌తిరేక‌ మీడియాలు. మెగా సామాజిక కార్య‌క్ర‌మాలు, బ్ల‌డ్‌బ్యాంక్‌, ఐబ్యాంక్ పైనా నింద‌లు వేస్తూ బోలెడ‌న్ని రూమ‌ర్లు పుట్టించారు. అయితే అవ‌న్నీ ఫేక్ అని నిరూపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు మెగా హీరోలు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇదివ‌ర‌కూ రాజ‌మండ్రిలోని ఓ ప్ర‌భుత్వ హోమియో క‌ళాశాల కోసం ఏకంగా కోటి ఆర్థిక విరాళం ప్ర‌క‌టించి మెగాస్టార్ చిరంజీవి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు.

అయితే అన్న‌య్య ప్ర‌క‌టిస్తే మేమేమైనా త‌క్కువా? అన్న‌ట్టు మెగాస్టార్ అభిమానులు అంత‌కంటే గొప్ప విరాళాన్ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. అఖిల భార‌త చిరంజీవి యువ‌త అమ‌రావ‌తి -హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన అభిమాన సంఘాల‌ స‌మావేశంలో కోటి విరాళం ప్ర‌క‌టించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. అమ‌ర‌ జ‌వాన్ల కుటుంబాలలోని పిల్ల‌ల చ‌దువుల కోసం కోటి విరాళాన్ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ని క‌లిసి అందించ‌నున్నామ‌ని చిరంజీవి యువ‌త జాతీయ అధ్య‌క్షుడు స్వామినాయుడు ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టనున్నామ‌ని, నీటి ఎద్ద‌డి ఉన్న గ్రామాల్లో మంచి నీటి ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. మార్చి 18న ల‌క్ష‌మంది అభిమానుల స‌మ‌క్షంలో `రంగ‌స్థ‌లం` ఆడియో ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.