సైరా విషయంలో చిరుకు, సురేందర్ రెడ్డికి విబేధాలు మొదలయ్యాయా?

Monday, July 22nd, 2019, 07:13:58 PM IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అయితే తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమా ప్రారంభమయ్యి ఏడాది గడిచిపోయినా ఇంకా సినిమా రిలీజ్ ఎప్పుడనేది మాత్రం చిత్ర బృందం అధికారికంగా చెప్పడంలేదు. అయితే సినిమాకి సంబంధించి చిరు సొంత ప్రొడక్షన్ కావడం, సినిమాపై కొన్ని కండీషన్‌లు పెడుతుండడంతో సురేందర్ రెడ్డికి మరియు చిరంజీవికి మధ్య కాస్త భేదాభిప్రాయలు తలెత్తాయని అందుకే సినిమా విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుందని సినీ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు సైరా వంటి సినిమా, మరియు స్టార్ హీరో చిరంజీవి కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వాదనల ప్రకారం సురేందర్ రెడ్డి అనుభవరాహిత్యం వలన సినిమా తీయడానికి చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. అయితే ఇదే విషయంలోనే చిరుకు, సురేందర్ రెడ్డికి కాస్త పడడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా చిత్రీకరణలో ఇగోల వంటివి కాస్త పక్కన పెట్టి సినిమాపై ఫోకస్‌గా పనిచేయాలని అప్పుడే సినిమా అంచనాలను అందుకోగలదని అభిమానులు సైతం సలహాలు ఇస్తున్నారట.