టాప్ సీక్రెట్‌ : బెజ‌వాడ హైవేలో సినిమావోళ్ల బిజినెస్‌!

Thursday, March 1st, 2018, 04:32:35 PM IST

టాలీవుడ్ నిర్మాత‌లు కేవ‌లం సినిమాల‌పైనే ఆధార‌ప‌డి బ‌తికేయ‌రు. కొంద‌రు రెస్టారెంట్ బిజినెస్‌, బార్‌& రెస్టారెంట్ బిజినెస్‌లోనూ లెక్క‌కుమిక్కిలిగా ఆర్జిస్తున్నారు. ఆ కోవ‌లోనే ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కనిర్మాత‌లు, హీరోయిన్లు ఇప్ప‌టికే హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఈ త‌ర‌హా వ్యాపారాలు చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. అదంతా స‌రే.. లేటెస్టుగా హైవేల వెంబ‌డి రెస్టారెంట్లు ప్రారంభించ‌డం న‌యా ప్యాష‌న్‌. హైవేల్లో దాబాల‌కు పోటీగా కొత్త కాన్సెప్టుతో ఆహారాన్ని అందిస్తే కాసుల గ‌ల‌గ‌ల‌ల‌కు కొద‌వేం ఉండ‌ద‌నేది అనుభ‌వ‌జ్ఞులు చెబుతున్న మాట‌.

అందుకే హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే దారిలో హైవే వెంబ‌డి ఓ కొత్త త‌ర‌హా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించేందుకు టాలీవుడ్ నిర్మాత కం డైరెక్ట‌ర్ కం బిజినెస్‌మేన్‌ అనీల్ సుంక‌ర ప్లాన్ వేశార‌ట‌. ఆ క్ర‌మంలోనే `రాజుగారి తోట‌` పేరుతో హోట‌ల్ చైన్‌ని ప్రారంభించారు. విజ‌య‌వాడ హైవే.. సూర్య పేట ప‌రిస‌రాల్లో ర‌ణ‌య‌న గూడెం అనే చోట ఈ స్పెష‌ల్లీ డిజైన్డ్ హోట‌ల్‌ని ప్రారంభించార‌ని తెలుస్తోంది. నిర్మాత‌ అనీల్ సుంక‌ర‌, బిజినెస్‌మేన్‌లు వివేక్ కూచిపూడి, రాజేష్ గామినితో క‌లిసి రాజుగారి తోట హోట‌ల్ చైన్‌ని ప్రారంభించారు. అందులో భాగంగా నేడు సూర్యాపేట్ వ‌ద్ద బ్రాంచీ ప్రారంభ‌మైంది. ఈ హోట‌ల్‌కి ఇంటీరియ‌ర్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవ‌రో తెలుసా? ఆవ‌కాయ్ బిరియానీ హీరో క‌మ‌ల్ కామ‌రాజు. అత‌డో పెద్ద ఆర్కిటెక్ట్ కం హీరో. సాంప్ర‌దాయ కేర‌ళ కుటీరం, మండువా ఆకృతిలో డిజైన్ చేసిన `రాజుగారి తోట‌` ప‌ర్యాట‌కుల్ని ఆక‌ర్షించేలా ఉంద‌ని చెబుతున్నారు. నాటుకోడి ప‌లావ్‌తో పాటు సాంప్ర‌దాయ‌క ప‌లావ్‌లు, రాజుగారి దోశ‌, స‌న్ ఫ్ల‌వ‌ర్ ఇడ్లీ ఇలా స్పెష‌ల్స్ చాలానే ఉంటాయిట‌.