ప్చ్.. ‘పిట్టలదొర’కున్న క్రేజ్ డైరెక్టర్ కు లేకపాయే !

Thursday, June 6th, 2019, 05:54:48 PM IST

టిఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగన సూర్యవంశి హీరో హీరోయిన్లుగా కలైపులి ఎస్ థాను నిర్మణంలో తెరకెక్కిన లవ్ ఎంటర్‌టైనర్ -హిప్పీ. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. అయితే ఈ రోజు ఉదయం ప్రసాద్ ఐమాక్స్ లో ఈ చిత్రం మార్నింగ్ షో వేసారు. కార్తికేయ మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ హిట్ అవ్వడంతో ఈ సినిమా మార్నింగ్ షోకి ప్రేక్షకులు అలాగే పబ్లిక్ టాక్ ను కవర్ చేయడానికి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా బాగానే హాజరయ్యారు. కాగా షో పూర్తయ్యాక బయటకు వస్తోన్న ఆడియన్స్ ను సినిమా ఎలా ఉందనే పబ్లిక్ టాక్ ను కవర్ చెయ్యటానికి మీడియా ముమ్మరంగా ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

పై ఫోటోను గమనిస్తే.. ఎడమ వైపు వైట్ ప్యాయింట్ లో ఉన్న వ్యక్తినే ఈ సినిమా డైరెక్టర్ టిఎన్ కృష్ణ. ఇక కుడివైపు ఉన్న గుంపును చూస్తే.. అక్కడ మీడియా ప్రతినిధులు పిట్టలదొర స్పీచ్ ను కవర్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే పబ్లిక్ టాక్ పలు ఫన్నీ స్పీచ్ లు ఇచ్చి ఫేమస్ అయిన పిట్టలదొర, నిన్న భారత్ మీద కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు, ఈ రోజు హిప్పీ సినిమాకు వచ్చాడు. అయితే షో అయ్యాక బయటకు వస్తోన్న క్రమంలో మీడియా అంతా ఈ సినిమా డైరెక్టర్ ను వదిలేసి.. సినిమా చూడటానికి వచ్చిన పిట్టలదొర వైపు పరుగులు తీశారు.

మొత్తానికి సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏ రోజు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అని ఆలోచించేలోపే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. ఒక సినిమా ప్రీమియర్ షోకి వచ్చి.. ఆ సినిమా డైరెక్టర్ మాట్లాడదామని ముందుకు వస్తే.. ఆయన్ని పక్కన పడేసి.. మీడియా మొత్తం ఎవరో పిట్టలదొర చుట్టూ చేరిందంటే.. సోషల్ మీడియా ప్రభావం అంచనా వెయ్యొచ్చు. ఇక ఆ సమయంలో ఆ డైరెక్టర్ కి ఏమి చెయ్యాలో తెలియక ఎవరో అటుగా పోతున్న వ్యక్తితో మాట్లాడుతూ పరువు నిలబెట్టుకోవడానికి తన వంతు ప్రయత్నం తానూ దిగ్విజయంగా పూర్తి చేశాడు.

ఏమైనా సినీ ఫీల్డ్ అంటేనే మాయ ప్రపంచం.. ఇక్కడ హిట్ కి మాత్రమే విలువ ఉంటుంది.. ప్లాప్ అయితే, అఫీస్ బాయ్ కూడా చులకనగా చూస్తాడని తెలుసు. కానీ సినిమా ప్లాపా హిటా అని తేలకముందే ఒక డైరెక్టర్ ను ఇలా పట్టించుకోకపోవడం ఆ డైరెక్టర్ కి ఖచ్చితంగా బాధ కలిగించే అంశమే.