ధూమ్‌ధాంగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి జ‌యంతి?

Friday, April 20th, 2018, 01:19:02 AM IST

ద‌ర్శ‌క‌ర‌త్న, ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కు.. డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణించి అప్పుడే ఏడాది అయిపోతోంది. గ‌త ఏడాది మే 30న ఆయ‌న అనంత‌లోకాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఇంకొద్ది రోజుల్లోనే చూస్తుండ‌గానే సంవ‌త్స‌రం పూర్తి కాబోతోంది. అయితే ఇంకా ఏడాది అయినా పూర్తి కాక‌ముందే అప్పుడే జ‌నంలో మ‌ర‌పు క‌నిపిస్తోంది. గ‌త ఏడాది ఈ రోజుల్లో దాస‌రి ఆరోగ్యంపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకున్నారు. ఇండ‌స్ట్రీలో స్థ‌బ్ధ‌త నెల‌కొంది. ఆయ‌న ఆస్ప‌త్రిలో సీరియ‌స్ కండిష‌న్‌లో చికిత్స పొంది, తిరిగి ఇంటికి చేరుకోవ‌డంతో అంతా ఊపిరి తీసుకున్నారు. కానీ ఏమైందో.. అప్ప‌టిక‌ప్పుడే ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా మారి అనూహ్యంగా అనంత లోకాల‌కు వెళ్లిపోయారు. మ‌నిషి జీవితం ఎప్పుడు ఏమ‌వుతుందో ఊహించ‌లేమ‌ని చెప్పేందుకు దాస‌రి మ‌ర‌ణం ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌గానూ నిలిచింది. అయితే అధిక‌బ‌రువు త‌గ్గించుకునేందుకు ఆయ‌న తీసుకున్న లైపోస‌క్సెమీ దీర్ఘ కాలంలో విక‌టించింద‌ని కొంద‌రు విశ్లేషించారు. అదంతా గ‌తంగ‌తః. వ‌ర్త‌మానం ఏంటి? అంటే అస‌లు దాస‌రి క‌నుమ‌రుగై ఏడాది అయినా గ‌డ‌వ‌కుండానే ఆయ‌న్ని ప్రేక్ష‌క‌లోకం మ‌ర్చిపోయిందే అనిపిస్తోంది.

అయితే వందేళ్ల భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో, 85ఏళ్ల టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఆయ‌న్ని మ‌ర్చిపోవ‌డం అంత తేలిక కాదు.. అని నిరూపించే అరుదైన సంద‌ర్భం రానే వ‌చ్చింది. పెద్దాయ‌న మ‌ర‌ణించి ఇప్ప‌టికే ఏడాది అయిపోతోంది కాబ‌ట్టి, వ‌చ్చే జ‌యంతిని ఏ స్థాయిలో జ‌రిపిస్తారోనన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. దాస‌రి మే 4న జ‌న్మించారు. అంటే ఆ రోజున జ‌యంతి ఉత్స‌వం జ‌ర‌పాల్సి ఉంటుంది. అయితే ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కు జ‌యంతి ఏర్పాట్లు ఏ రేంజులో సాగుతున్నాయి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికైతే దాస‌రి శిష్యుల్లో క‌ద‌లిక ఉంద‌ని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఏ వార్త వెలువ‌డ‌క ముందే ఏదీ చెప్ప‌లేం. కాబ‌ట్టి దాస‌రిని గుర్తు చేసే, మ‌రోసారి త‌లుచుకునే ఈ కార్య‌క్ర‌మం ఏ తీరుగా చేస్తారో వేచి చూడాలి. ప‌నిలో ప‌నిగా డా.దాస‌రి త‌న స‌తీమ‌ణి దాస‌రి ప‌ద్మ మ‌ర‌ణించిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ 24 శాఖ‌ల కార్మికుల్ని ల‌క్ష‌లాదిగా జ‌నాల్ని పిలిచి మాదాపూర్ -ఇమేజ్ గార్డెన్స్‌లో పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నం పెట్టిన సంగ‌తిని ఇప్ప‌టికీ మ‌ర‌వలేరు. ఆ స్థాయిలో ఈ వేడుక ఉండ‌బోతోందా? శిష్యులే ప్రాక్టిక‌ల్‌గా చెప్పాల్సి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments