‘జియాఖాన్’కు బాలీవుడ్ వీడ్కోలు..

Wednesday, June 5th, 2013, 11:05:11 PM IST


ఎన్నెన్ని కలలు కన్నాయి ఆ కన్నె కళ్లు..
అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్లు..

అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని అడుగుపెట్టిన ఓ అందాల తార కొద్ది కాలంలోనే నింగికెగిసింది. జీవితంపై విరక్తితో అర్థాంతరంగా తనువు చాలించింది. ఇరవై ఐదేళ్లకే హఠాత్తుగా.. విషాదకరంగా జీవితాన్ని చాలించింది వర్ధమాన తార జియాఖాన్. బుధవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని శాంతా క్రూజ్ స్మశాన వాటికలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, జియా సన్నిహితుడు, నటుడు ఆదిత్య పంచోలి పాల్గొన్నారు. అంతకుముందు అమీర్ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, సిద్ధార్ధ్ మాల్యా, సోఫియా చౌదరి ఇంకా పలువురు బాలీవుడ్ నటీనటులు జియా మృతదేహాన్ని సందర్శించి వీడ్కోలు పలికారు.

సోమవారం రాత్రి ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ వార్త బాలీవుడ్ ను నివ్వెరపరిచింది. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు మరో కొత్త విషయం తెలిపారు. జియా ఇంతకుముందూ ఓసారి ప్రాణాలు తీసుకోబోయిందని తెలిపారు. ఎనిమిది నెలల క్రితం తాగిన మైకంలో మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఆమె గదిలో సోదా చేసిన పోలీసులకు పలు ఆయుర్వేద నిద్ర మాత్రలు కనిపించాయి. దీన్నిబట్టి ఆమె చాలాకాలం నుంచే తీవ్ర మానసిక వ్యాకులత అనుభవించినట్టు స్పష్టమవుతోంది. జియాబాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలిని ప్రశ్నించగా.. ఆమెకు సినిమా చాన్సులు తగినన్ని లభించని నేపథ్యంలో డిప్రెషన్ కు లోనైనట్టు చెప్పాడు. ప్రస్తుతం ప్రాథమిక పోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు ఉరి కారణంగానే జియా మరణించినట్టు తెలిపారు. ఆమె అంతర్గత అవయవాలను కూడా పరీక్షిస్తే.. ఆత్మహత్యా సమయంలో మద్యం గానీ, మాదకద్రవ్యాలు గానీ సేవించింది, లేనిదీ స్పష్టమవుతుందని వారు చెప్పారు.