వర్మ ఎంత కెలికినా.. ‘లక్ష్మీస్’ను ఎవ్వరు పట్టించుకోవవట్లేదుగా !

Sunday, June 2nd, 2019, 01:54:49 PM IST

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట అదే అసలు ఎవరు గెలవబోతున్నారనేది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలలో ఉత్కంఠత ఏర్పడింది. అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికి టికెట్‌లు దక్కుతాయి అన్న సందేహాలు వచ్చినా మొత్తానికి ఒకటి రెండు చోట్ల అలకలు తప్పా మిగతా చోట్ల మాత్రం సీట్ల పంపకాల విషయాలపై సమస్యలేమి తలెత్తలేదు. అయితే ఆ తరువాత పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు ప్రచారాలపై దృష్టి సారించారు. అయితే ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారాలను కూడా పరుగులు పెట్టించారు ఆయా పార్టీల నాయకులు.

అయితే ఈ సారి ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపించింది. అయితే ఈ ఇరు పార్టీలు ఎన్నికలకు ముందు సినిమా సెంటిమెంట్‌ను కూడా బాగానే వాడుకున్నాయి. ఒకపక్క టీడీపీకి ఫేవర్‌గా బాలక్రిష్ణ హీరోగా నటించిన కథానాయకుడు సినిమా విడుదల చేసుకుని పర్వాలేదనిపించుకున్నా కార్యకర్తలలో, టీడీపీ అభిమానులలో మాత్రం మంచి ఊపు కనిపించింది. అయితే వైసీపీ కూడా తామేమి తక్కువ కాదంటూ యాత్ర పేరిట వైఎస్ పాదయాత్రను కన్నులకు కట్టినట్టు చూపించి ప్రజలలో వైసీపీపై మరింత గొప్ప అభిప్రాయాన్ని తీసుకువచ్చేలా చేసింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్‌టీఆర్ పై లక్ష్మీస్ ఎన్‌టీఆర్ అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే ఎన్నికల ముందు ఈ చిత్రం విడుదలకు రామ్ గోపాల్ వర్మ ఎంతగానో ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణం చేత ఈ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కానివ్వలేదు. అయితే ఎన్‌టీఆర్ మరణం వెనుక అసలు కారకులెవరు, ఆ చివరి క్షణాల్లో ఏమి జరిగింది అనే దానిపై ఈ చిత్రం కథ ఆధారపడి ఉంది. అయితే ఎన్నికలకు ముందే తెలంగాణలో ఈ చిత్రం విడుదలైనా, ఏపీలో మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడినాక ఈ చిత్రం విడుదలవ్వడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతుంది. అంతేకాదు ఫలితాలు వెలువడి టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం వలన ఈ సినిమా ఇప్పుడు ఏపీలో పెద్దగా కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతుంది. అయితే పోటాపోటీగా మూడు నాలుగు సినిమాలు ఉండడం వలన మొన్నటి వరకు రాజకీయ వేడిలో ఉన్న జనాలు కాస్త రిలాక్స్ అయ్యే సినిమాలాకు వెలుతున్నారే తప్పా లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాకు రావడానికి ఇష్టపడడంలేదట. అయితే ఈ సినిమాను ఎన్నికలకు ముందు విడుదల చేసి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయట.