ఆ న‌లుగురు ప‌నైపోయిందా?

Wednesday, December 5th, 2018, 10:00:49 PM IST

బ్రిటీష్ వాళ్లు అనుస‌రించిన విభ‌జించి పాలించు సూత్రాన్ని టాలీవుడ్‌కి అన్వ‌యించి పాలించిన ఆ న‌లుగురు ప‌నైపోయిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇంత‌కాలంగా ఆ నాలుగు ప‌త్రిక‌లు, ఆ నాలుగు చానెళ్ల‌కు మాత్ర‌మే వాణిజ్య ప్ర‌క‌టన‌లు ఇవ్వాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న ఆ న‌లుగురు ఎల్ఎల్‌పీ చివ‌రికి మాల్యా టైపు ఐపీ పెట్ట‌డంతో ఇప్పుడు ఆ నాలుగు మీడియాలు సైతం ఆ న‌లుగురిపై క‌త్తి క‌ట్టాయ‌ని తెలుస్తోంది. త‌మ‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు పెద్ద మొత్తంలో పోగుప‌డ‌డం.. అటుపై వాటిని ఎల్ఎల్‌పీకి కార‌కులైన గ్యాంగ్స్ చెల్లించ‌క‌పోవ‌డంతో వాళ్ల‌ను వెలివేయాల‌ని పెద్ద మీడియాలు నిర్ణ‌యించుకున్నాయ‌ట‌.

హిట్టొస్తే కోట్ల‌కు కోట్లు దండుకునే ఆ న‌లుగురు కంపెనీలు చిన్నా చిత‌కా మీడియాల్ని ఆద‌రించ‌కుండా దూరం పెట్టే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఎల్‌.ఎల్‌.పీని తెర‌పైకి తెచ్చాయి. మీడియాని రెండుగా చీల్చి, చిన్న మీడియాల్ని ఆకులో వ‌క్క‌లాగా వాడుకున్నాయి. దీంతో ఇప్ప‌టికే చిన్న మీడియాల‌న్నీ ఆ న‌లుగురుపై గుర్రుమీద‌నే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల‌కు ఆ నాలుగు ప‌త్రిక‌లు, ఆ నాలుగు పెద్ద చానెళ్లు సైతం ఎదురు తిరిగే స‌న్నివేశం ఉండ‌డంతో ఇక ఎల్‌.ఎల్‌.పీ ర‌ద్ద‌యిన‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది. న‌చ్చిన‌వాళ్ల‌కు, బినామీ మీడియాల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకునే ఆ న‌లుగురి ఆట అయిపోయింద‌న్న మాటా వినిపిస్తోంది. నిర్మాత‌ల్లోనే ఎల్‌.ఎల్‌.పీ విష‌యంలో వ్య‌తిరేక‌త ఉంది. నిర్మాత‌ల మండ‌లిలో ఒకే గొడుగు కింద‌ నిర్మాత‌ల‌కు రెండు గ్రూపులు అవ‌స‌ర‌మా?. ఎవ‌రిని ఉద్ధ‌రించ‌డానికి అని ప్ర‌శ్నించే వాళ్లున్నారు. ఇక త‌మ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ఆ న‌లుగురు థియేట‌ర్ల‌పై క‌ర్చీప్ వేయ‌డంతో ఇప్ప‌టికే చిన్నా చిత‌కా నిర్మాత‌లంతా వాళ్ల‌పై గుర్రుమీద ఉన్న సంగ‌తి తెలిసిందే. మీడియాకు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య అగాధానికి కార‌ణ‌మైన ఎల్‌.ఎల్‌.పీ ప‌ని ఇక అయిపోయిన‌ట్టేన‌న్న చ‌ర్చ ఇప్పుడు వేడెక్కిస్తోంది. ఈ మొత్తం ఎల్‌.ఎల్‌.పీ కి ప్లాన్ చేసిన దిల్ రాజు- డి.సురేష్‌బాబు- దామోద‌ర్ రెడ్డి బృందానికి ఇప్పుడు పెద్ద పంచ్ ప‌డ‌నుంద‌ని చెబుతున్నారు.