విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయడం ఎంతవరకు సమంజసం.. చిరంజీవి ట్వీట్..!

Thursday, April 22nd, 2021, 07:09:11 PM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం తేల్చి చెప్పడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొద్ది రోజులుగా ఉద్యమం బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండడం ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడంతో కార్మికులు బెట్టు వీడి మళ్ళీ తమ విధుల్లో చేరి ఆక్సిజన్ ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం సరికాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు తెలిపిన మెగస్టార్ చిరంజీవి మరోసారి దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషంట్స్ అల్లాడిపోతున్నారని, ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరిందని అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ని మహారాష్ట్ర తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెడుతుందని, అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.