సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు.. మంత్రి తలసాని కీలక ప్రకటన..!

Thursday, May 28th, 2020, 08:32:03 PM IST

లాక్‌డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా నేడు MCHRDలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్ల రీ ఓపెనింగ్ తదితర అంశాల పై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే సినిమా, టీవీ షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

అంతేకాదు అసోసియేషన్ ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్‌లలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతిని అందచేశారు. అయితే రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. దియేటర్ లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది.

అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుందని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో నటులు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, N.శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు C.కళ్యాణ్, KS.రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ళ ప్రతినిధులు బాపినీడు, జెమిని కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాం మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.