అందుకే చిన్న దర్శకులతో చెయ్యడం లేదు – నాగ చైతన్య.!

Wednesday, December 11th, 2019, 04:25:10 PM IST

విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య లు రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు అన్న సంగతి అందరికి తెలుసు.అలాగే ఇదే ఇద్దరు రాశి ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లతో బాబీ దర్శకత్వంలో రీల్ మామ అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం “వెంకీ మామ”. ఈ చిత్రం మొదలయ్యినప్పటి నుంచి కూడా మంచి అంచనాలు ఏర్పర్చుకుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర అంశాలను తన సినీ ప్రస్థానం కోసం బయట పెట్టారు.

అయితే చైతు కెరీర్ లో చేసిన ఎన్నో సినిమాలను గమనిస్తే నూతన దర్శకులతో చేసిన సినిమాలు చాలా తక్కువ కనిపిస్తాయి.ఎక్కువగా హిట్ దర్శకులు లేదా కాస్త సీనియర్ దర్శకులే తన చిత్రాలకు కనిపిస్తారు.అయితే అసలు తాను ఎందుకు కొత్త వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం లేదు?కేవలం పెద్ద దర్శకులతోనే ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు నాగ చైతన్య తన సమాధానం ఇలా ఇచ్చారు.

తాను కొత్త వారితో కన్నా కాస్త అనుభవం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తానని ఎందుకంటే ఒకవేళ కొత్త దర్శకులతో చేసినట్టయితే వారి దృష్టిలో నేను పెద్ద హీరోలా కనిపిస్తానని అందువల్ల షూట్ టైంలో కొన్ని సీన్లు సరిగ్గా రాకపోతే వాళ్ళు మళ్ళీ రీటేక్ చెయ్యమనడమో లేక రీషూట్ చేద్దామా అని అడగడానికి కాస్త ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారని అదే ఒకవేళ కాస్త అనుభవం ఉన్న దర్శకులు అయితే తాను ఒకవేళ సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారని ప్రస్తుతానికి ఒక రెండు మూడు హిట్లు అందుకుంటే ఆ తర్వాత తప్పకుండ కొత్త వాళ్లకి అవకాశం ఇస్తానని చైతు ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ప్రస్తుతం తన మామతో కలిసి నటిస్తున్న చిత్రం ఈ డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.