పరుగుల వీరుడి చిత్రానికి పన్ను మినహాయింపు

Sunday, July 21st, 2013, 03:30:26 AM IST


‘ఫ్లయింగ్ సిక్కు’గా ప్రపంచానికి సుపరిచితుడైన ఓ స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథను అధారంగా చేసుకుని యువ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్, స్టార్ డెరైక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘భాగ్ మిల్కా భాగ్’. ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలు పొందుతున్న ఈ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది.

మహారాష్ట్ర వినోదపు చట్టం 1923 సెక్షన్ 6(3) కింద మిల్కా చిత్రానికి ఈరోజు నుంచి ఆరు నెలల వరకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో మిల్కా పాత్ర పోషించిన నటుడు ఫర్హాన్ అక్తర్, చిత్ర దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కొన్నిరోజుల కిందట మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ ధోరెట్ ను కలిసి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో, ఈ చిత్రాన్ని వీక్షించిన మహా సర్కారు.. యువతను క్రీడల వైపు మళ్ళించేందుకు ఈ చిత్రం బాగా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రస్తావిస్తూ, మినహాయింపుకు అంగీకరించింది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.