మనీషాకు ఇదీ కొత్త జీవితం..!

Thursday, July 25th, 2013, 07:00:53 PM IST


నేపాలీ భామ.. అయినా ఇండియన్స్‌ను బాగా అలరించింది మనీషా కొయిరాల. ఒక దశలో తిరుగులేని హీరోయిన్ గా ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాలంలోనే 2010లో మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది మనీషా. అప్పటి నుంచి ఆమె రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు ఎదురుదెబ్బ తగిలింది. భర్తతో విడిపోయింది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. భయంకరమైన క్యాన్సర్ వ్యాది మనీషాను వెంటాడింది. కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్న మనీషా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.

కేన్సర్ తో పోరాడి విజయం సాధించింది. తన తాజా రూపంతో ఉన్న ఫొటోలను ట్వీట్ చేసింది. మొదట తలగుడ్డతో ఉన్న ఫొటోలను చూపించిన ఆమె చివరకు గుండుతో ఉన్న ఫొటోలను బయటపెట్టింది. ఆ ఫోటోలలో అనారోగ్య చిహ్నాలేమీ లేకుండా ఆమె ముఖం కళకళలాడుతూ కనిపిస్తోంది. కేన్సర్ నుంచి బయటపడ్డాక ఆమె దృష్టి ఆధ్యాత్మికం వైపు మళ్లింది. నిత్యం పూజలతో గడుపుతోంది. వాటికి సంబంధించిన ఫోటో లతో తన ట్విట్టర్ ఎక్కౌంట్ ని నింపేస్తోంది. తను ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్తోంది.

గత ఏడాది తనకు గర్భాశయ కేన్సర్ అని తేలడంతో చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది మనీషా. తర్వాత కేన్సర్‌ను జయించానంటూ ఉద్వేగంగాప్రపంచానికి తెలిపింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ఆమెలోని పాజిటివ్ వైబ్రేషన్సే త్వరగా కోలుకునేటట్లు చేసిందని చెప్తున్నారు. ఆమె అనారోగ్యం నుంచి విముక్తి అయ్యాక.. షిరిడీ సాయిబాబా గుడికి వెళ్లింది. అలాగే ఓ చర్చిని కూడా సందర్శించింది. కాన్సర్‌ నుంచి పూర్తిగా విముక్తి చెంది కోలుకున్న మనీషా కొయిరాలా మెల్లగా దైనందిన కార్యక్రమాలు మొదలు పెడుతోంది. తను కాన్సర్ ని జయించానని సంతోషంగా చెప్తోంది. అండాశయ క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది. తన అనుభవాలను ట్విట్టర్ లో రాసుకుంటోంది.

ఒక సమయంలో కెరీర్ సరిగా లేక పోవడం, పర్సనల్ లైఫ్ సమస్యలతో బాగా సఫర్ అయిన మనీషా.. ఆ మధ్య మద్యానికి బానిసైంది. ఆమె అనారోగ్యానికి ఈ అలవాటుకు కూడా కారణమనే టాక్ కూడా వినిపించింది. మనీషా చివరి సారిగా నటించిన సినిమా ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘భూత్ రిటర్న్స్’.

మనీషా తిరిగి కోలుకుని రావటంతో బాలీవుడ్ చాలా ఉత్సాహంగా ఆమెకు వెల్ కమ్ చెప్పింది. ఆమె తోటి హీరోయిన్స్ ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటించాలని అంటున్నారు. మనీషా ని ఫోన్ ల్లో పలకరిస్తూ ఆమెతో పనిచేసిన దర్శక,నిర్మాతలు ఆమెకు నైతిక ధైర్యానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేన్సర్ ను జయించిన అనంతరం మనీషా ఏ సినిమాతో రీఎంట్రీ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.