సినీ గేయరచయిత వాలి కన్నుమూత

Thursday, July 18th, 2013, 04:00:02 PM IST


సినీ ప్రపంచం నుంచి మరో ఆణిముత్యం నేలరాలింది. ప్రముఖ చలన చిత్ర గేయ రచయిత వాలి కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన్ను ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు ఆణిముత్యాలు లాంటి పాటలు అందించిన వాలికి తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలు సంతాపం ప్రకటించాయి.

వాలి అసలు పేరు రంగరాజన్, స్వస్థలం తిరుచ్చిలోని శ్రీరంగం. 1958వ సంవత్సరం సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వాలి పదివేలకు పైగా పాటలు రాశారు. తమిళంలో అత్యధిక పాటలు రాసిన వాలి.. తెలుగులో కూడా పలు సినిమాలకు పాటలు అందించారు. తమిళనాట స్టార్ హీరోల సినిమాలకు వాలి పాటలు ఎంతో క్రేజీ తీసుకొచ్చాయి.

81 ఏళ్ల వాలికి తమిళ చిత్ర పరిశ్రమతో ఐదు దశాబ్ధాల అనుబంధం ఉంది. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు ఆణిముత్యాలు లాంటి పాటలతో సేవలు అందించారు. వాలి ప్రతిభకు అనేక పురష్కారాలు వచ్చి ఆయన్ని సత్కరించాయి. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో వాలిని సన్మానించింది. వాలిని కోల్పవడం దక్షిణాది సినిమాలకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.