కాపీ రైట్ వివాదంలో 13 నామినేష‌న్ల‌ ఆస్కార్ మూవీ?

Friday, March 2nd, 2018, 10:41:41 PM IST

ఆ సినిమా ఏకంగా ఆస్కార్ బ‌రిలో 13 విభాగాల్లో పోటీప‌డుతోంది. ఇందులో క‌నీసం స‌గం పైగా ఎగ‌రేసుకు వ‌చ్చే స‌త్తా ఉన్న చిత్రంగా పాపుల‌రైంది. ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయితే ఇంత‌టి క్రేజీ మూవీ కాపీ క్యాట్ వివాదంలో చిక్కుకోవ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈనెల 4 న ఘ‌నంగా ఆస్కార్ అవార్డుల పండుగ జ‌ర‌గ‌నుంది. ఐదో తేదీన స్టార్-ఇండియా టీవీలో ఈ కార్య‌క్ర‌మం లైవ్ కానుంది.

క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన డ‌న్‌కిర్క్ స‌హా `ది షేప్ ఆఫ్ వాట‌ర్‌` సినిమా భారీ క్రేజుతో ఆస్కార్‌ల బ‌రిలో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 13 నామినేష‌న్ల‌తో టాప్‌లో ఉంది. 90వ ఆస్కార్ వేడుక‌ల్లో విమ‌ర్శ‌కులంతా ఈ సినిమా సాధించ‌బోయే అవార్డులేమిటా? అని అంతా ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నారు. ఈలోగానే ఈ చిత్రం కాపీ క్యాట్ మూవీ అంటూ వివాదం త‌లెత్త‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పులిట్జ‌ర్ విజేత అయిన ప్ర‌ముఖ ప్లే రైట‌ర్ పాల్ జిందెల్ వార‌సుడు డేవిడ్ జిందెల్ తాజాగా కాలిఫోర్నియాలో కాపీ రైట్ కేసును ఫైల్ చేయ‌డంతో వివాదం ప‌తాక స్థాయికి చేరింది. పాల్ జిందెల్ టీవీ ప్లే `లెట్ మి హియ‌ర్ యు విస్ప‌ర్‌`(1969) నుంచి క‌థాంశం, సీన్లు దొంగిలించార‌ని ఫిర్యాదీ వాదిస్తున్నారు. ది షేప్ ఆఫ్ వాట‌ర్‌ ద‌ర్శ‌కుడు గుల్లెర్మో డెల్ టారో ప‌క్కాగా కాపీ కొట్టాడ‌ని ఆరోపించారు. ఓ మూగ అమ్మాయికి సముద్ర జీవితో ఏర్ప‌డిన అనుబంధం నేప‌థ్యంలో షేప్ ఆఫ్ వాట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఓ ల్యాబ్‌లో జ‌ల‌చరంతో స్నేహం చేసే ల్యాబ్ క్లీన‌ర్ (మ‌గువ‌) క‌థాంశం లెట్ మిహియ‌ర్ యు విస్ప‌ర్‌. ఈ రెండిటికి సారూప్య‌త ఉందంటూ ఫిర్యాదుదారు వాదిస్తున్నాడు. అయితే అలాంటిదేం లేద‌ని, ఇది ఒరిజిన‌ల్ క‌థాంశ‌మేన‌ని ది షేప్ ఆఫ్ వాట‌ర్ మేక‌ర్స్ పైకోర్టుల్ని ఆశ్ర‌యించ‌నున్నారు.