రివ్యూ రాజా తీన్‌మార్ : రాజా ది గ్రేట్ – సినిమా మొత్తాన్ని సింగిల్ గా మోసిన రవితేజ !

Wednesday, October 18th, 2017, 05:00:47 PM IST

కెప్టెన్ ఆఫ్ ‘రాజా ది గ్రేట్ ‘ : అనిల్ రావిపూడి

మూల కథ :
లక్కీ (మెహ్రీన్ కౌర్) సిన్సియర్ పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్)కి కూతురు. ప్రకాష్ రాజ్ డ్యూటీలో విలన్ దేవ తమ్ముడిని చంపేస్తాడు. దాంతో దేవ ప్రతీకారం కోసం ప్రకాష్ రాజ్ ను చంపేసి, అతని కూతురు లక్కీని కూడా చంపాలనుకుంటాడు. కానీ లక్కీ మాత్రం అతన్ని నుండి తప్పించుకుని పారిపోతుంది.

అదే సమయంలో పోలీస్ అవ్వాలని కలలుగనే చూపులేని రాజా (రవితేజ) పోలీసులతో కలిసి ఆమెను కాపాడే మిషన్ లో దిగుతాడు. ఇక అక్కడి నుండి రవి తేజ చూపు లేకపోయినా ఆమెను ఎలా కాపాడాడు, దేవాను ఎలా ఎదిరించాడు అనేదే సినిమా.

విజిల్ పోడు :

–> మాస్ మహారాజ రవితేజ రెండేళ్ల తర్వాత వచ్చినా తనలోని ఎనర్జీ, మాసిజం ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. చూపులేని వ్యక్తిగా చాలా పర్ఫెక్ట్ గా నటించి ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఇంతేగాక తన ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఆహ్లాదపరిచాడు. కాబట్టి మొదటి విజిల్ ఆయనకే వేయొచ్చు.

–> దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హీరో పాత్రను బాగా డిజైన్ చేసుకుని, అందులోకి రవితేజను ప్రవేశపెట్టి కమర్షియల్ గా వర్కవుట్ అవడానికి మంచి ఫన్ ను జనరేట్ చేశాడు. కాబట్టి ఆయనకి రెండో విజిల్ వేయొచ్చు.

–> ఇక మథర్ సెంటిమెంట్ కూడా అక్కడక్కడా వర్కవుట్ కాగా అంధుడైన హీరో పాత్రకి రాసిన కొన్ని సన్నివేశాలు, ఫైట్స్ మెప్పించాయి. కాబట్టి మూడో విజిల్ ఈ అంశాలకి వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఈ సినిమాలో సరైన, కొత్తదనమున్న కథే లేదు. దీంతో పూర్తిస్థాయి సంతృప్తి దొరకదు. ఒకవేళ రవితేజకాకుండా వేరే హీరో ఎవరైనా ఈ సినిమాను చేసుంటే ఫలితం దారుణంగా ఉండేది.

–> కేవలం మొదటి అరగంటలోనే పూర్తిగా కథ రివీల్ అయిపోవడంతో సినిమాలో నవ్వులు తప్ప ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కడా ఉండదు.

–> సెకండాఫ్లో అనవసరమైన, లాజిక్ లేని కొన్ని సన్నివేశాల్ని పెట్టి సినిమానౌ పొడిగించి ఇబ్బంది పెట్టారు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఎంత సినిమా అయినా బ్యాక్ దొంగతనం ఇంత సిల్లీగా ఉంటుందా అనేలా ఒక ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : మొత్తానికి రవితేజ రీ ఎంట్రీ బాగుంది.
–> మిస్టర్ బి : సినిమా కూడా పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ ఉంది.
–> మిస్టర్ ఏ : అది కూడా రవితేజ ఉండటమే వల్లనేలే.
–> మిస్టర్ బి : అవునవును సినిమా మొత్తాన్ని సింగిల్ గా మోసేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments