భళ్లాలుడి కటౌట్ కి అదిరిపోయే రోల్ రెడీ అవుతోంది..!

Sunday, October 15th, 2017, 03:10:59 PM IST

బాహుబలిలో భల్లాలుడిగా మెప్పించిన రానా జాతీయ స్థాయి గుర్తింపుని పొందాడు. రానా ఒడ్డు పొడుగు తడికి ప్లస్ పాయింట్. రానా కటౌట్ కు తగ్గ పాత్రని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ ‘హిరణ్యకశిపుడు’ అనే హిస్టారిక్ చిత్రాన్ని టేకప్ చేసినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా ఆ చిత్రానికి సంబందించిన ప్రాధమిక పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

రానా ని టైటిల్ రోల్ లో పెట్టి ఈ చిత్రం తెరకెక్కించడానికి గుణశేఖర్.. సురేష్ బాబుతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. రానా కూడా ఈ ఇతిహాస పాత్రపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానా ఆహార్యం ఇలాంటి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అయినా దుర్యోధనుడి పాత్ర చేసి మెస్మరైజ్ చేశారు. ఎస్వీ రంగారావు హిరణ్య కశిపుడు పాత్రలో నటించిన భక్త ప్రహ్లాద చిత్రం ఓ క్లాసిక్. ఇప్పుడు ఆ పాత్రని పోషించే అవకాశం రానా కు దక్కింది. రానా ని నెగిటివ్ రోల్ లో గుణశేఖర్ ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.