కెలుక్కుని దొరికిపోతున్న ఆర్జీవీ

Wednesday, May 9th, 2018, 02:09:04 AM IST

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో వైరం తెచ్చుకోవ‌డం ద్వారా త‌న‌కు తానుగానే కొరివి పెట్టుకున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. వివాదాల‌తో చెలిమి చేస్తే ప్ర‌తిసారీ త‌న‌కు మంచి ప్ర‌చార‌మే ల‌భిస్తుంద‌ని భావించిన అత‌డికి, ఈసారి మాత్రం చుక్కెదురొచ్చింది. ప‌వ‌న్ నేరుగా రంగంలోకి దిగి నానా హంగామా చేశాడు. ఆర్జీవీ క్ష‌మాప‌ణ‌లు చెప్పేదాకా విడిచిపెట్ట‌లేదు. ఇక ప‌వ‌న్ అభిమానులు అయితే అత‌డిని, అతడి వెన‌క ఉన్న వాళ్ల‌ను ఓ రేంజులో ఏకేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో తిట్టి పోస్తున్నారు.

తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌తో వ‌ర్మ వివాదం వెలుగులోకి వ‌చ్చింది. ఈసారి ఆఫీస‌ర్ ట్రైల‌ర్‌కి దాదాపు 11 వేల డిస్‌లైక్స్ రావ‌డంపై ఆర్జీవీ స్పందించాడు. ప‌వ‌న్‌కి 11 వేల మంది ఫ్యాన్స్ మాత్ర‌మే ఉన్నారా? అరెరే జాలేస్తోందే! అంటూ వెట‌కారం ఆడాడు ఆర్జీవీ. అస‌లు ట్రైల‌ర్‌ని ఓపెన్ చేయెకుండానే డిస్‌లైక్ కొట్టేస్తున్నారు. ప‌వ‌న్ అభిమానుల‌కు ఐక్యూ లేదా? అని ప్ర‌శ్నించాడు. దానికి కౌంట‌ర్‌గా మీ ఫ్యామిలీ స‌భ్యులు కూడా పీకే ఫ్యాన్సే కదా.. పాపం మీ ట్రైల‌ర్‌కి వాళ్లు కూడా డిస్‌లైక్ కొట్టే ఉంటారు పాపం! అంటూ ఓ అభిమాని రీట్వీట్ చేశాడు. అస‌లు నీ ట్రైల‌ర్లు చ‌చ్చినా ఓపెన్ చేయ‌మ‌ని వేరొక అభిమాని ట్వీట్ యుద్ధం చేశాడు. ఇదంతా చూస్తుంటే మునుముందు ఇది ఇంకా ముదిరి పాకాన ప‌డేట్టే క‌నిపిస్తోంది.