వివాదాల రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. లోకం అంతా ఒక దారిలో వెళుతుంటే తాను మాత్రం వేరొక దారి వెతుక్కోవడం ఆర్జీవీకి ఉన్న అలవాటు. ఇదే అతడిని సంఘం నుంచి సపరేట్ చేస్తోంది. ఏ పాయింట్‌ని టచ్ చేస్తూ మాట్లాడితే తాను లైమ్ లైట్లో ఉండగలడో ఆ పాయింట్‌ని టచ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నానుతుంటాడు. ముఖ్యంగా మోనోటనీని అనుసరించే జనాలకు ఒక రకంగా వర్మ ఓ కనువిప్పు. రివర్స్ సైకాలజీ అన్న ప్రాసెస్‌లో అందరినీ ఎడ్యుకేట్ చేయడం ఆయనకే చెల్లింది.
గత కొన్నేళ్లుగా వర్మ అనుసరిస్తున్న ఈ ఫార్ములా అతడు ఏమీ సాధించకపోయినా ప్రముఖుల జాబితాలో ఉండేలా చేయగలిగింది. ఈనెల 7న తెలంగాణ ఎన్నికల సందర్భంగా వర్మను ఇంటర్వ్యూ చేసిన టీవీ9 జాఫర్ ఇదే విషయాన్ని తెలుసుకోగలిగాడు. ఓటేసేవాళ్లు మూర్కులు అని వర్మ ఇచ్చిన కొటేషన్ పట్టుకుని ఏకంగా జాఫర్ జనాభిప్రాయం కోసం రోడ్లెక్కడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓటేసే మీరు మూర్ఖులా? అంటూ జాఫర్ జనాల్ని ప్రశ్నిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. అది టీవీల్లో చూసే మేధోవర్గానికి మాత్రం షాకింగ్ అనిపించింది. అంటే రేపు ఓటేసేవాళ్లంతా మూర్ఖులే అనేది టీవీ9 ఉద్ధేశమా? వర్మ ఏదో అన్నాడని అందరనీ మూర్ఖుల్ని చేసేస్తున్నారా? అంటూ తిట్లు మొదలయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం లాంటిది. దుర్మార్గపు నాయకుల్ని దించేసే ఏకైక ఆయుధం. కానీ ఓటు వేసేవాళ్లకు అసలు పార్టీల సిద్ధాంతాలు, పాలసీలు తెలుసా? మ్యానిఫెస్టో అయినా చదువుతారా? అన్నది వర్మ పాయింట్. అది పాయింటే అయినా మ్యానిఫెస్టో చదవాల్సిన అవసరం ప్రజలకు ఉందా? పొద్దున్న లేస్తే నాయకులంతా ఊరూ వాడా తిరిగేస్తూ చేస్తున్న ప్రచారం మ్యానిఫెస్టోల గురించే కదా? అలాంటప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేరవుతున్నట్టు చదవాల్సిన అవసరం లేదు కదా? అన్న వాదనా వినిపించింది. మొత్తానికి టీవీ 9 ఎత్తుగడ టీఆర్పీకి బాగానే వర్కవుట్ అయ్యి ఉండొచ్చు కానీ, ఆ ఒక్క ప్రశ్నతో ఆర్జీవీని మూర్ఖుల జాబితా నుంచి తొలగించడం సాధ్యమవుతుందా? తనకు అంతు చిక్కని ప్రశ్న ఏదైనా ఎదుటివారి నుంచి ఎదురైతే అర్థంకాని జవాబుతో కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అయ్యే ఎస్కేపిస్ట్ వర్మ ఇలా జనాల్ని ప్రతిసారీ కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారంతా.