వాయిదా పడ్డ “ఆర్ఆర్ఆర్” మరియు “ఆచార్య” సినిమాల షూటింగ్!

Tuesday, April 20th, 2021, 08:28:23 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన పలు సినిమాల తేదీలు వాయిదా పడ్డాయి. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం ఇప్పటికే షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతి కారణంగా సినిమా షూటింగ్ వాయిదా వేయడం మాత్రమే కాక, ఈ చిత్రం విడుదల పై కూడా కరోనా వైరస్ ప్రభావం పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కలిసి తొలిసారి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో షూటింగు కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ మరియు పూజ హెగ్డే లు సైతం ఈ చిత్రం లో కనిపించనున్నారు. అయితే ఈ ఏడాది రావాల్సిన రెండు పెద్ద సినిమాలు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడటం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం ప్రజలను తీవ్ర ఆందోళనకి గురి చేసే అంశం అని చెప్పాలి.