‘సాహో’ బ్లాక్ బ్లస్టరా ? బిగెస్ట్ డిజాస్టరా ?

Sunday, June 2nd, 2019, 06:50:15 PM IST

తెలుగు సినిమా ఖ్యాతిని కీర్తిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నత స్థానంలో నిల‌బెట్టిన ‘బాహుబలి’ చిత్రాల‌ తరువాత.. మళ్లీ ఆ స్థాయిలో రాబోతున్న ఏకైక తెలుగు సినిమా ‘సాహో అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి చేస్తునప్పటికీ.. నిజంగా ‘సాహో’ బాహుబలితో పోల్చుకోతగ్గ చిత్రమేనా..! హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు సాహోకు పనిచేస్తున్నారు, పైగా డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేసారు లాంటివి చెప్పుకుని ప్రభాస్ ఫ్యాన్స్ సాంత్వన పొందటం తప్పితే.. వాస్తవ పరిస్థితి సాహోకు ఏ మాత్రం అనుకూలంగా లేదు.

కేవలం ఒక సినిమా తీసిన దర్శకుడు.. అదీ నాలుగు కోట్ల సినిమాకి దర్శకత్వ వహించిన ముప్పై ఏళ్ళు కూడా నిండని ఒక యంగ్ డైరెక్టర్ పై ఏకంకా 250 కోట్ల భారీ బడ్జెట్ నమ్మి పెట్టడం తెలివైన పనేనా ? పులిని చూసి నక్క వాత పెట్టుకున్న మాదిరిగా.. ఏభై కోట్లతో మొదలైన సాహో.. బాహబలికి వచ్చిన వందల కోట్ల రూపాయల రెవిన్యూను చూసి… ఏభై నుండి వందకు, వంద నుండి రెండొందల ఏభై కోట్లకు పెరిగింది. ‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ మార్కెట్ వందల కోట్లు అనుకుని లెక్కలు వేసి మరి ‘సాహో’ నిర్మాతలు సినిమా బడ్జెట్ పెంచి ఉండొచ్చు గాక…

ఎక్కడైనా కథను పెట్టి బడ్జెట్ ఫిక్స్ చేస్తారు.. కానీ ‘సాహో’కు మాత్రం బడ్జెట్ పెరిగాక, మార్పులు చేర్పులు చేసి కథను సెట్ చేసుకున్నారు. అంతెందుకు బాహుబలి కూడా స్క్రిప్ట్ పూర్తయ్యాకే ప్రొడక్షన్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే ప్రొమోషన్స్ విషయంలో కలిసొచ్చింది. సినిమా షూట్ మొదలై రిలీజ్ అయ్యే వరకూ బాహుబలి పై అన్ని భాషల్లోని ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. విచిత్రంగా ‘సాహో’కు తెలుగులో కూడా ఆ స్థాయిలో అంచనాలు లేవు. ఈ విషయంలో సాహో మేకర్స్ పూర్తిగా విఫలయం అయ్యారనే చెప్పాలి. ఇప్పటివరకూ ‘సాహో’ నుండి వచ్చిన షూటింగ్ ప్రోమోస్, టీజర్… ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా.. ఏది, సినిమా స్థాయికి తగ్గట్లు లేదు. దీనితోడు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హాలీవుడ్ సినిమాకు కాఫీ అని తేలిపోయింది.

ఇక విడుదలకు మరో రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. మరి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు.. బడ్జెట్ చూస్తే ఆకాశంలో ఉంది. ఈ పరిణామాలన్నిటిని పరిశీలించిన కేఆర్కే లాంటి కొందరు సినీ విశ్లేషకులు.. ఆగష్టు 15 విడుదల రాబోతున్న సాహో బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది, కారణం 250 కోట్ల భారీ బడ్జెటే అంటూ అధికారికంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కేఆర్కేను కొంతమంది లైట్ తీసుకున్నా.. అతను గతంలో చాలా సినిమాల రిజల్ట్ విషయంలో కరెక్ట్ గానే చెప్పాడు.

అందుకు తగ్గట్లుగానే దుబాయ్ లో చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం 78 నుంచి 80 కోట్ల మధ్యలో ఖర్చు పెట్టారు దర్శకనిర్మాతలు. నాలుగు సంవత్సరాల క్రితం ఒక సూపర్ స్టార్ మొత్తం సినిమా బడ్జెట్ ఇది. ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ను కూడా 50 కోట్ల లోపే తీశారు. అలాంటిది ఒక ఫైట్ కోసం అన్ని కోట్లు పెట్టడం అవసరమా.. ? భారీ విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, మైమరపించే విన్యాసా పోరాటాలు సినిమాను నిలబెట్టలేవని ‘రోబో 2.ఓ’ లాంటి చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి కూడా. ఆ లెక్కన ‘సాహో’ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని చెప్పగలమా..!