జీడిపాకంలా సీరియల్ – గిన్నిస్ రికార్డ్..!

Monday, October 28th, 2013, 07:00:00 PM IST


మన దేశంలో బోర్ రానిదంటూ ఉందంటే అది ఒక్క టీవీ సీరియలే నంటున్నారు మన ప్రేక్షకులు. జీడిపాకంలా ఎన్నేళ్లు సాగినా చూస్తామంటున్నారు. అందుకే సంవత్సరాల తరబడి సీరియల్స్ సా..గుతూనే వున్నాయి. తాజాగా పదహారేళ్ల పాటు ప్రసారమైన ఓ సీరియల్ గిన్నిస్ బుక్ రికార్డుల కూడా అందుకుంది.

సోనీ చానల్ లో ప్రసారమవుతున్న ‘సీఐడీ’ (క్రైమ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ డిపార్ట్‌మెంట్‌) సీరియల్‌ 1998 జనవరి 21న ప్రారంభమైంది. అయితే సీరియల్ కు ప్రజాధరణ భారీగా వచ్చింది. దీంతో పదహారేళ్లుగా అలుపు లేకుండా అలా సాగిపోతూనే ఉంది.. గిన్నీస్‌ రికార్డుల్లో స్థానాన్ని పదిలపరచుకుంది. ఈ ధారావాహికలోని ‘ఇన్‌హెరిటెన్స్‌’ ఎపిసోడ్‌ గిన్నీస్‌లోకి ఎక్కింది. ఏకధాటిగా ఒక హోటల్‌లో దీన్ని 111 నిమిషాల పాటు ఏమాత్రం కట్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో చిత్రీకరించారు. 2004 నవంబరు 7న ఇది ప్రసారమై ‘లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు’, ‘గిన్నీస్‌’ రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ ఎపిసోడ్‌ కథా రచన కూడా గమ్మత్తే. సీఐడీకి ఓ శాశ్వత గుర్తింపు ఉండాలని భావించిన బీపీ సింగ్‌, సింగిల్‌ షాట్‌లో ఒక ఎపిసోడ్‌ చిత్రీకరించాలనుకున్నారు. ఇందుకోసం నాలుగేళ్లపాటు ఎన్నో ఆలోచనలూ కథలూ అనుకున్నా వీలు కాలేదు. ‘ఒక హాలు.. సోఫాలో కూర్చొన్న వ్యక్తికి దూరంగా తుపాకీ శబ్దం వినిపిస్తుంది’.. ఓ రోజు తనకు తట్టిన ఈ చిన్న దృశ్యాన్ని రచయితల ముందుంచి దీన్నుంచే కథ అల్లమన్నారు. అలా తయారైందే ఈ ఎపిసోడ్‌. ఈ సీరియల్‌లో ఈ ఎపిసోడ్‌ తనకో పెద్ద సవాల్‌ అంటారు బీపీ సింగ్‌. కథ లేకుండా అల్లుకున్న ఎపిసోడ్‌ కదా మరి. గిన్నీస్ రికార్డ్ కి ఎక్కిన మన టీవీ సీరియల్ ఈ సీరియల్‌ పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే చివరకు బాలీవుడ్‌ బడా హీరోలు కూడా తమ సినిమా ప్రచారాలకు ఈ సీరియల్‌ను వేదికగా ఎంచుకున్నారు.

ఇటీవలే వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ విజయం ఓ సమష్టి కృషి. ఈ సీరియల్‌ విజయం కథా రచయితలదేనంటారు నిర్మాతా, దర్శకుడు బీపీ సింగ్‌. మొత్తం తొమ్మిది మంది రచయితలు నిరంతరం ఈ సీరియల్‌ కోసం వందలు, వేల కథలు రాస్తుంటారు. ఒక్కో ఎపిసోడ్‌కు 30-40 కథల కంటే ఎక్కువే ఎంచుకుని వాటిని వడపోసి ఓ మంచి కథతో చిత్రీకరణకు వెళతారు.