ట్రెండీ టాక్‌ : స్టార్ డైరెక్ట‌ర్ నిర్వేదం!

Thursday, July 18th, 2019, 03:00:21 PM IST

రిలీజ్ ముందు ఏ ద‌ర్శ‌క‌నిర్మాత‌కు అయినా ఎలాంటి టెన్ష‌న్ ఉంటుందో చెప్పాల్సిన ప‌నేలేదు. రేపు ఏం జ‌ర‌గ‌బోతోంది? ఎలాంటి ఫ‌లితం రాబోతోంది? అన్న మ‌ద‌నం త‌ప్ప‌నిస‌రి. ఇండ‌స్ట్రీ హిట్‌ల‌ని అందించి స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో ఈపాటికే అర్థ‌మై వుంటుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించే ఇదంతా. గ‌త కొంత కాలంగా ఈ ద‌ర్శ‌కుడికి హిట్ లేదు. `టెంప‌ర్‌` ఫ‌ర‌వాలేద‌నిపించినా ఆ త‌రువాత ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ముఖం చాటేశారు. చివ‌రికి కొడుకుని అయినా నిల‌బెట్టాల‌ని త‌ను చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు.

దీంతో ద‌ర్శ‌కుడిగా త‌న ప‌ని అయిపోయిన‌ట్టేనా అని మ‌ద‌న‌ప‌డిన అత‌నికి రామ్ రూపంలో కొత్త ఆశ చిగురించింది. దీంతో తెలంగాణ నేప‌థ్యాన్ని తీసుకుని ప‌క్కా హైద‌రాబాదీ కుర్రాడి క‌థ‌తో `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రాన్ని మ‌లిచాడు. తొలి టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచాయి. అయినా ఎక్క‌డో అప‌న‌మ్మ‌కం, అభ‌ద్రాతా భావం, భ‌యం పూరిని వెంటాడాయా అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. వాస్త‌వానికి మీడియాకు ఈరోజు షో వేయాల్సి ఉండ‌గా.. విమ‌ర్శ‌కులు ఎలా స్పందిస్తారో అన్న సందేహంతో క్యాన్సిల్ చేశార‌ట‌. రివ్యూలు సినిమా క‌లెక్ష‌న్ల‌పైనా ఓపెనింగ్స్‌పైనా ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయోన‌న్న భ‌యం పూరీని వెంటాడింద‌ట‌. ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్‌ల‌ను అందించిన ద‌ర్శ‌కుడు ప్రెస్‌కి షో వేయ‌డానికి భ‌య‌ప‌డ్డార‌ట‌. దాంతో ప్రెస్‌కి షో వేయ‌కుండానే సినిమాను విడుద‌ల చేశారు. అయినా సినిమా బిలో యావ‌రేజ్ అనే ఫ‌లితం ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చింది. ప‌తాక స్థాయిలో స్టార్‌డ‌మ్‌ని చూసిన ద‌ర్శ‌కుడికి ఇలాంటి ప‌రిస్థితా అంటూ అంతా నిట్టూరుస్తున్నారు. ఎంత మీడియాకి షో వేయ‌క‌పోయినా థియేట‌ర్ల నుంచి రిపోర్ట్ వ‌చ్చేస్తుంది క‌దా..? అంటూ విమ‌ర్శ‌కుల్లో చ‌ర్చ సాగుతోంది.