టాప్ స్టోరి : పురుగుమందులు అమ్ముతున్న స్టార్‌ హీరోలు?

Tuesday, January 9th, 2018, 09:14:01 PM IST

కోలాలు విష‌ర‌సాయ‌నాల‌తో ప్ర‌జ‌ల‌కు ముప్పు తెస్తున్న వైనంపై ఎప్ప‌టిక‌ప్పుడు డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎల‌ర్లీల‌కు చికిత్స చేసే డాక్ట‌ర్లు అయితే అస‌లు కోలా అన్న‌దే ముట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తుంటారు. అంతేకాదు ప‌లు ర‌కాల ఛ‌ర్మ‌వ్యాధులు, క్యాన్స‌ర్ల‌కు కోలాలు కార‌ణ‌మ‌వుతున్నాయి. అందుకు కార‌ణం స‌హేతుకంగా ఉంద‌ని ఇదివ‌ర‌కే ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. కోలాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అందులో బాక్టీరియా, పురుగుల్ని చంపే క్రిమిసంహార‌క విష‌ర‌సాయ‌నాల్ని మోతాదుకు మించి వినియోగిస్తున్న సంగ‌తి శోధ‌న‌లో తేలింది. ఆ క్ర‌మంలోనే కోకోకోలా వంటి ప్ర‌ముఖ బ్రాండ్ల‌ను కోర్టులు నిషేధించాయి. ప్ర‌భుత్వాలు అందుకు స‌మ్మ‌తించాయి. కానీ ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో.. తిరిగి మ‌ళ్లీ అవే బ్రాండ్లు య‌థాత‌థంగా ఇప్ప‌టికీ ఇండియ‌న్ మార్కెట్ల‌ను ముంచెత్తుతూనే ఉన్నాయి.

థియేట‌ర్లు, మాల్స్‌, ప‌బ్బులు, క్ల‌బ్బులు, చిల్ల‌ర దుకాణాలు, కిల్లీ కొట్లు .. ఇలా కోలాలు అందుబాటులో లేనిదెక్క‌డ‌. అంటే ఆ రేంజులో ప్ర‌జ‌ల ఆరోగ్యాల్ని ఖూనీ చేయ‌డంలో కోలాలు పోటీప‌డుతున్నాయి. ఇప్ప‌టికే లెక్క‌కు మిక్కిలి కోలా బ్రాండ్లు అందుబాటులోకి వ‌చ్చాయి. వీటివ‌ల్ల జ‌నం ఆరోగ్యం ఎన్నిర‌కాలుగా గంగ‌లో క‌లిసిపోతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అయినా వీటిపై నిషేధం అన్న‌దే లేదు. ప్ర‌భుత్వాలు ప‌న్ను ఆదాయం అన్న కోణంలో వీటిని ఉదారంగా చూస్తూ వ‌దిలేస్తున్నాయి. ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల జీవితాల్లోకి ప్ర‌మాదాల్నిఆహ్వానిస్తున్నాయి. ఇక‌పోతే ఈ ప్ర‌మాద‌క‌ర కోలాల‌కు ప్ర‌ముఖ హీరోల‌తో ప్ర‌మోష‌న్ చేయిస్తూ కార్పొరెట్లు కోట్ల‌లో ఆదాయం ఆర్జిస్తున్నాయి. అలా ప్ర‌మోష‌న్ చేసినందుకు హీరోలు అంతే పెద్ద మొత్తాల్ని అందుకుంటున్నారు. ప్ర‌ముఖ బ్రాండ్ల‌తో కాంట్రాక్టుల‌కు సంత‌కాలు చేసి, కోట్ల‌కు కోట్లు అకౌంట్ల‌లో వేసుకుంటున్నారు. అయితే వీళ్లు చేసే పాపాల‌కు అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లైపోతున్నార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్ప‌టికే బాలీవుడ్, టాలీవుడ్ స‌హా అన్ని భాష‌ల్లోని హీరోలు కోలాల‌కు ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. స‌ల్మాన్‌, ర‌ణ‌వీర్‌, మ‌హేష్‌, బ‌న్ని, చ‌ర‌ణ్ .. ఇలా హీరోలంతా ఈ బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తున్న‌వాళ్లే. అయితే త‌మ‌ను స్ఫూర్తిగా తీసుకునే అమాయ‌క అభిమానులు, ప్ర‌జ‌ల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్య‌త వీళ్ల‌కు లేదంటారా? ప‌్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు వినియోగించే ఈ కోలాల‌కు ప్ర‌మోష‌న్ చేయ‌క‌పోతే వీళ్ల జేబుల‌కు చిల్లు ప‌డిపోతుందంటారా? కామ‌న్ జ‌నాల‌కు.. వాటీజ్ దిస్ న్యూసెన్స్ స్టుపిడ్‌లీ!!