ఒక సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన కథ ఇది. ఎందరో యువతకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన లైఫ్ స్టోరి ఇదని చెప్పాలి. ఒక మామూలు నటుడిగా మొదలై, ఆ తర్వాత ఇండస్ట్రీ టాప్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్, హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్న తీరు నభూతోనభవిష్యతి.. అయితే ఇప్పుడే ఎందుకిలా అయ్యాడు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్..
ఒక సాధారణ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి, హీరో అవ్వడం అనేది అంత సులువేం కాదు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు సునీల్. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఒక్కో మెట్టు ఎక్కడానికి ఎంతో కఠోరంగా శ్రమించిన సునీల్ హీరోగానూ తనకంటూ ఓ రేంజ్ ఉందని నిరూపించాడు. అతడి కెరీర్లో అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. తడాఖా, భీమవరం బుల్లోడు వంటి చక్కని విజయాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన `2 కంట్రీస్`లో సునీల్ నటన, డ్యాన్సులకు చక్కని ప్రశంసలు దక్కాయి. రీసెంట్ టైమ్స్‌లో విజయాలు దోబూచులాడడం కెరీర్ పరంగా కొంత ప్రభావం చూపించిందన్న మాట వాస్తవం.
అయితే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మొక్కవోని ధీక్షతో ఇప్పటికీ హీరోగా తనని తాను నిలబెట్టుకునేందుకు సునీల్ ఎంతో తపిస్తున్నారు. ఓవైపు పలు క్రేజీ సినిమాల్లో క్యారెక్టర్ నటుడిగా నటించేందుకు సన్నాహకాల్లో ఉన్న సునీల్ హీరోగానూ అడపాదడపా సినిమాలతో అలరించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు. ఇక తన స్నేహితుడు, రూమ్ మేట్ అయిన త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తానని ఇదివరకూ ప్రకటించిన సునీల్ .. ప్రస్తుతం అందుకు సంబంధించిన అప్డేట్ చెబుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ బరిలో దిగితే సునీల్ కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. హీరోగా అతడికి మరింత మైలేజ్ పెంచే బాధ్యత మిత్రుడిదే. అయితే కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేడు(28 ఫిబ్రవరి) సునీల్ పుట్టినరోజు .. అతడికి శుభాకాంక్షలు.