ట్రైలర్ రివ్యూ : “సైరా”..రాసి పెట్టుకోండి దర్శకుడు మాటలే నిజం కాబోతున్నాయి

Wednesday, September 18th, 2019, 06:36:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియన్ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. చిరుతో పాటుగా అమితాబ్ బచ్చన్,కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతి,నయనతార మరియు తమన్నా లాంటి అగ్ర తారలు ఎంతో మంది నటించిన ఈ చిత్రంపై అంచనాలు మామూలు స్థాయిలో లేవు.ఇదే అంచనాలను మరింత ఎక్కువ చేస్తూ మొత్తం ఐదు భాషల్లోనూ ఈ ట్రైలర్ విడుదల అయ్యింది.ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మరియు ట్రైలర్ కు ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఒక “భావోద్వేగం”. కన్న తల్లిలాంటి భారతమాతను ఎవడో ఒకడు వచ్చి దోచుకుంటూ ఇక్కడి ప్రజలను బానిసలుగా మార్చినపుడు కలిగే ఒక రకమైన ఆక్రోశం,ఈ ఎమోషన్ ను మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారు.అందుకు తగ్గట్టుగా ఇక ఈ పాత్రలో మెగాస్టార్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం అన్న స్థాయిలో చిరు పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అసలు ఈ ఆరు పదుల వయసులో కూడా ఇంత ఎనర్జీ మరే హీరోలో కూడా ఊహించలేం అన్న రేంజ్ లో చిరు పెర్ఫామెన్స్ చేసారు.అలాగే యాక్షన్ సీన్స్ చిరు పలికించిన డైలాగులు మొట్టమొదటి భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు అంటే ఇలాగే ఉంటాడా?అనే రేంజ్ లో చిరు నటన వర్ణనాతీతం.

అలాగే కేవలం ఒక్క చిరును మాత్రమే కాకుండా దేశం అనే భావోద్వేగాన్ని మొత్తం 3 నిమిషాల్లో క్యారీ చేస్తూనే ఇతర పాత్రల్లో కనిపించే నటులను కూడా ఈ ట్రైలర్ లోనే చూపించి అందరి పాత్రలకు దర్శకుడు సురేందర్ రెడ్డి న్యాయం చేకూర్చారు.అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ ఆ భారీ విజువల్స్ ఎక్కడా తగ్గని రామ్ చరణ్ నిర్మాణ విలువలను సుస్పష్టంగా చూపించాయి.అలాగే ఈ మొత్తం టీజర్ కు జూలియస్ పకియం అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది.

మైనస్ పాయింట్స్ :

ఖచ్చితంగా మెగాస్టార్ మరియు మెగాభిమానులు ఈ ఒక్క ట్రైలర్ ను చూసి మొట్టమొదటిసారి ఆనందపడరు.ఎందుకంటే ఉన్న మూడు నిమిషాల్లో కూడా మెగాస్టార్ ఫ్రేమ్ కనిపిస్తూనే ఉండాలి ఇంకా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగున్ను అని కోరుకునే వారికి మాత్రం కాస్త నిరాశ కలిగించవచ్చు.అలాగే కేవలం ఒకసారి మాత్రమే ఈ ట్రైలర్ చూసిన వారికి మాత్రం ఖచ్చితంగా లాగ్ అనిపిస్తుంది.మరోసారి చూస్తేనే తప్ప ఈ ట్రైలర్ లో లీనం అవ్వడం కష్టం.అక్కడక్కడా రెండు మూడు ఫ్రేముల్లో విఎఫెక్స్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది.

తీర్పు :

ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే గత ఏడాది మొట్టమొదటి టీజర్ ను విడుదల చేసేటప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక మాట చెప్పారు.ఈ సినిమాపై ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి..వాటిని మించే ఈ సినిమా ఉండబోతుంది అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు.ఈ ట్రైలర్ చూసాక ఆయన అంత నమ్మకంగా చెప్పడంలో ఎంత మాత్రం తప్పు లేదని చెప్పొచ్చు.ట్రైలర్ లో తెల్ల దొరలమీద యుద్ధం అయ్యింది ఇక బాక్సాఫీస్ మీద యుద్ధమే మిగిలి ఉంది.అప్పటి వరకు వేచి చూద్దాం.