ట్రైలర్ టాక్ : తెల్ల దొరల రొమ్ము చీల్చిన యోధుడా..”సైరా” నరసింహా రెడ్డి..

Wednesday, September 18th, 2019, 06:00:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అమితాబ్ బచ్చన్,కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతి,నయనతార మరియు తమన్నా లాంటి అగ్ర తారలు ఎంతో మంది నటించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. మామూలుగానే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి.అలాంటిది ఒక భారీ బడ్జెట్ చిత్రం అయితే? అందులోనూ మొట్టమొదటి భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర అయితే? ప్రతీ ఒక్క భారతీయుడికి ఆ విజువల్ తలచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ ట్రైలర్ ను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకరకమైన భావోద్వేగం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది.అప్పుడు లేని మనమంతా నిజంగానే అక్కడ ఉన్నామా అన్నంత గ్రాండ్ గా చాలా సహజంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ముఖ్యంగా కేవలం ఈ మూడు నిమిషాల నిడివిలోనే మెగాస్టార్ కనిపించిన ప్రతీ ఒక్క విజువల్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

దానితో పాటుగా ఆయన చెప్పిన డైలాగ్స్ ఎక్కడి నుంచో వచ్చి మన దేశస్థులని బానిసలుగా మార్చిన తెల్ల దొరల రొమ్ము చీల్చే మొట్టమొదటి భారతదేశ యోధుడిలా మహా యుద్ధానికి ప్రాణం పోసి హైలైట్ గా నిలిచారు.కేవలం మొబైల్స్, డెస్క్ టాప్స్ లో చూసేవారికే ఒక రేంజ్ లో అనిపించిన ఈ ట్రైలర్ థియేటర్ లో వేరే లెవెల్లో ఉంటుంది.ఇక ఈ చిత్రం వెండితెర మీద పడినట్టయితే ఆ ఊహ ఇంకెలా ఉంటుందో బాక్సాఫీస్ మీద మెగాస్టార్ దాడి ఎలా ఉంటుందో అంచనా వెయ్యలేం.ఈ ధాటి ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగక తప్పదు.