విజ‌య్ అను నేను.. ఈసారి రూటు మార్చాను.. మ‌రేమో ఆ ఇద్ద‌రితో..?

Thursday, October 11th, 2018, 09:03:09 PM IST

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి నోటా చిత్రంతో ఊహించ‌ని విధంగా భారీ డిజాస్ట‌ర్ ఎదురైంది. నోటాకి ముందు విజ‌య్ నుండి వ‌చ్చిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు కావ‌డం.. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డం.. నోటా కూడా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ చిత్రం అంద‌రి అంచ‌నాలను త‌ల క్రిందులు చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద తొలి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న విజ‌య్ తేరుకోవ‌డానికి కొంత టైమ్ తీసుకొని త‌న త‌ర్వాత చిత్రాల పై క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం టాక్సీవాలా, డియ‌ర్ కామ్రెడ్ చిత్రాల్లో న‌టిస్తున్న విజ‌య్.. మ‌రో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేశాడని తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత కెఎస్ రామారావు నిర్మాణ సంస్థ‌లో ఓ చిత్రానికి సైన్ చేశాడు విజ‌య్. మ‌ళ్ళీ మ‌ళ్ళీ రాని రోజు ఫేం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్‌తో ఇద్దరు హాట్ భామ‌లు స్క్రీన్ పంచుకోనున్నార‌ట‌. తొలిప్రేమ స‌క్సెస్‌తో మంచి ఊపుమీద ఉన్న రాశిఖ‌న్న‌, త‌మిళ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్‌లు విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్నార‌ట‌. మ‌రి విజ‌య్ స‌ర‌స‌న ఒక హీరోయిన్ ఉంటేనే రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది.. మ‌రి ఈసారి త‌న రూటు మార్చి ఇద్ద‌రు భామ‌ల‌తో రొమాన్స్‌కి ప‌చ్చ జెండా ఊపిన విజ‌య్‌కు ఈసారి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.