ఇల‌య‌ద‌ళ‌ప‌తితో వైజ‌యంతి సినిమా?

Wednesday, September 19th, 2018, 02:40:39 PM IST

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. విజ‌య్ – అట్లీ కాంబినేష‌న్‌లో తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రానికి ప్ర‌స్తుతం స‌న్నాహ‌కాలు సాగుతున్నాయి. అట్లీ ఈ విష‌యాన్ని ఓ మీడియా ఇంట‌ర్వ్యూలోనూ రివీల్ చేశాడు. అయితే స‌రిగ్గా అందుకు ఒక‌రోజు ముందే వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ `దేవ‌దాస్` ఇంట‌ర్వ్యూలో అట్లీతో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంటే విజ‌య్ – అట్లీ కాంబినేషన్ మూవీకి ద‌త్ నిర్మాత అని భావిస్తున్నారంతా.

దాదాపు ఐదు ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న వైజ‌యంతి మూవీస్‌లో సినిమా అంటే చాలా పెద్ద రేంజులోనే ఉంటుంది. పైగా మ‌హాన‌టి చిత్రంతో ట్రాక్‌లోకి వ‌చ్చేసింది ఈ సంస్థ‌. ఇదే హుషారులో వ‌రుస‌గా క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తూ ద‌త్ ఉర‌క‌లెత్త‌డం చ‌ర్చ‌కొచ్చింది. అట్లీ ఇప్ప‌టికే విజ‌య్ హీరోగా తేరి, మెర్స‌ల్ లాంటి సంచ‌ల‌న విజ‌యాల్ని తెర‌కెక్కించాడు. ఈ నేప‌థ్యంలో హ్యాట్రిక్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతున్నాడు. విజ‌య్ – మురుగ‌దాస్ సినిమా పూర్త‌వ్వ‌గానే త‌దుప‌రి అట్లీ కోసం విజ‌య్ ప్రిపేర‌వుతాడు. ఈలోగానే ద‌త్ ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ప్ర‌క‌టిస్తార‌నే అభిమానులు వేచి చూస్తున్నారు.