పోసానికి అనారోగ్యం.. వైకాపా నేత‌ స‌జ్జ‌ల ప‌రామ‌ర్శ‌

Sunday, June 2nd, 2019, 08:38:48 PM IST

న‌టుడు .. ద‌ర్శ‌క‌నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌ను ప్ర‌ముఖ నాయ‌కుడు ప‌రామ‌ర్శించ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంత‌కీ పోసానికి ఏమైంది? అంటే.. ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలిసింది. ఆ వార్త తెలుసుకున్న‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. పోసాని ప్ర‌స్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ప‌త్రిలోనే సజ్జల పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోసానికి అందుతున్న వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సజ్జల ఆరా తీశారు.

ఇటీవ‌ల‌ రాజ‌మండ్రి ఎంపీ, సినీన‌టుడు ముర‌ళీమోహ‌న్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. వెన్నెముక ఆప‌రేష‌న్ జ‌రిగింది. అనంత‌రం తాను కోలుకుంటున్నాన‌ని ముర‌ళి మోహ‌న్ వెల్ల‌డించారు. వెన్ను న‌రం మెలిక ప‌డ‌డం వ‌ల్ల ఈ చికిత్స అవ‌స‌ర‌మైంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంప‌తులు స్వ‌యంగా వెళ్లి ముర‌ళిమోహ‌న్ ని పరామ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో పోసాని ఆస్ప‌త్రిలో చేర‌డంపైనా అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక పోసాని ఇటీవ‌ల వైయ‌స్సార్ కాంగ్రెస్ త‌ర‌పున క్యాంపెయినింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ గెలిచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ నేప‌థ్యంలో పోసాని సేవ‌ల‌ను గుర్తించి జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తారా? అంటూ ఇప్ప‌టికే ఫ్యాన్స్ లో చ‌ర్చ సాగుతోంది.