1999 లో జరిగిందే రీపీట్ అవుతుందా…?

Tuesday, December 29th, 2015, 03:57:44 PM IST

ఫిబ్రవరి 19, 1999.. ఓ చారిత్రాత్మకమైన రోజు. ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య బస్ సర్వీస్ ప్రారంభమైన రోజు. అప్పటి ఇండియా ప్రధాని వాజ్ పాయ్ ఢిల్లీ – లాహోర్ బస్ సర్వీస్ ను ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు. ఏకంగా బస్ లో పాకిస్తాన్ వెళ్లారు. పాక్ లోని వాఘా సరిహద్దు వద్ద వాజ్ పాయ్ ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రిసీవ్ చేసుకున్నారు. అయితే, ఇది పాక్ జనరల్ ముషారఫ్ కు నచ్చలేదు. ఇండియాపై వార్ ప్రకటించాడు. కార్గిల్ యుద్ధం జరిగింది.

ఇక, ఇప్పుడు మోడీ సైతం మొన్ననే ఆఫ్గనిస్తాన్ నుంచి ఇండియా వచ్చే సమయంలో పాకిస్తాన్ వెళ్లారు. లాహోర్ సడెన్ గా వెళ్ళడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరిపారు. అంతేకాదు.. షరీఫ్ మనవరాలు పెళ్లికి కూడా హాజరయ్యారు. ఇక, మోడీ పాక్ లో పర్యటించడంతో బీజేపి మిత్రపక్షం శివసేన మండిపడుతున్నది. పాక్ కు దగ్గర కావాలి అనుకోవడం..తప్పుడు చర్య అని.. గతంలో వాజ్ పాయ్ కూడా అలాగే చేశారని.. దాంతో యుద్ధం వచ్చిందని అలాగే వాజ్ పాయ్ రాజకీయంగా పరపతి తగ్గిపోవడం మొదలైనదని శివసేన అంటున్నది.

అయితే, బీజేపి మాత్రం దీనిని కొట్టేస్తున్నది. మోడీ పాక్ వెళ్ళడం శుభపరిణామమని.. రెండు దేశాల మధ్య శాంతి తప్పకుండా నెలకొంటుందని అంటున్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే.. కాశ్మీర్ సమస్య పరిష్కారం జరగడమే కాకుండా ఆసియాలో భారత్ బలం పెరుగుతుందని బీజేపి చెప్తున్నది. వచ్చే ఏడాది మోడీ మరోసారి పాక్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన కనుక విజయవంతం అయితే.. రెండు దేశాల మధ్య తప్పకుండా సయోధ్య నేలకొంటింది అనడంలో సందేహంలేదు. ఇక, భారత్ ముందున్న ప్రధాన సమస్య ఏమిటి అంటే..ఉగ్రవాదాన్ని వీలైనంతగా అణిచివేయడం. ప్రపంచంలో ఉగ్రవాదం నశిస్తే… ప్రపంచంలోని ప్రతిదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నది భారత్ నమ్మకం.