సింగపూర్ లో హీరోలైన భారత కూలీలు!

Saturday, April 25th, 2015, 05:49:10 PM IST

balcany
సింగపూర్ జరాన్ ఈస్ట్ ఎస్టేట్ నిర్మాణం రంగంలో పనిచేసే భారత కార్మికులు తాజాగా సింగపూర్ లో హీరోలయ్యారు. వివరాల్లోకి వెళితే షణ్ముగన్ నాధన్(35), ముత్తు కుమార్ (24)లు రోజూవారి పనిలో భాగంగా ఈస్ట్ ఎస్టేట్ లో పనిచేస్తుండగా ఉన్నట్టుండి ఒక పాప ఏడుపు వినిపించింది. దీనితో అప్రమత్తమైన వారిద్దరూ పాప ఏడుపు వినిపించిన దిశగా వెళ్లి చూడగా పక్క అపార్ట్ మెంట్ లోని రెండవ అంతస్తు బాల్కనీ గ్రిల్స్ మధ్య పాప ఇరుక్కుని ఉండడం వీరు గమనించారు. దీనితో హుటాహుటిన రెండవ అంతస్తులోకి ఎక్కిన ఇద్దరూ ఎస్పీడీఎఫ్ బలగాలు అక్కడకు చేరుకునే లోపే పాపను సురక్షితంగా కిందకు దించారు.

ఇక పాప ఐపాడ్ తో ఆడుకుంటుండగా అది కిందకు పడిపోవడంతో దాన్ని పట్టుకునే క్రమంలో గ్రిల్స్ మధ్య ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. కాగా అత్యంత ధైర్య సాహశాలను ప్రదర్శించి పాపను రక్షించిన వీరిద్దరికీ సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సు ప్రశంశలతో పాటు పబ్లిక్ స్పిరిటెడ్ అవార్డుకి ఎంపిక చేసింది. ఇక ఎవరైనా ఆపదలో ఉంటే తమలాగే వెంటనే ఆదుకోవాలని, అదే మన పిల్లలకు మేలు చేస్తుందని వీరిద్దరూ ప్రజలకు సందేశం ఇచ్చారు.