2.0 ఆడియో : భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ ఈవెంట్‌

Friday, October 27th, 2017, 07:00:13 PM IST

`బాహుబ‌లి-2` ని కొట్టే ద‌మ్మున్న సినిమాగా 2.ఓ గురించి ప్ర‌చారం సాగుతోంది. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ కోసం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేస్తున్నారు. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీ.. ఆడియో చ‌రిత్ర‌లో మ‌ర‌పు రాని అనుభ‌వంగా గుర్తుండిపోయేలా యూనిట్ ప్లాన్ చేసింది. దుబాయ్‌లో బుర్జ్ పార్క్‌లో అత్యంత వైభ‌వంగా నేటి సాయంత్రం ఈ ఈవెంట్ జ‌రుగుతోంది.

దుబాయ్ -బుర్జ్ పార్క్‌లో జ‌రుగుతున్న మొట్ట‌మొద‌టి బిగ్గెస్ట్ ఆడియో ఈవెంట్ ఇదే. వెన్యూ కోసం 2.ఓ టీమ్‌ దుబాయ్ ప్ర‌భుత్వాన్ని ఒప్పించి మ‌రీ ఈ ఈవెంట్‌ని నిర్వ‌హిస్తోంది. ఇక ఈ ఆడియో ప్ర‌త్యేక‌త‌లు అదే రేంజులో ఉన్నాయి. మూడు హెలీకాఫ్ట‌ర్ల‌లో దేశ‌విదేశాల‌ నుంచి టాప్ సెల‌బ్రిటీల్ని ఆడియో అతిధులుగా త‌ర‌లించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహ‌మాన్ 125 మంది సింఫ‌నీ సంగీత‌కారుల‌తో క‌లిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఈ వేడుక‌లో బాస్కో డ్యాన్స్ గ్రూప్ డ్యాన్సింగ్ షో హైలైట్‌గా ఉంటుందిట. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, రెహ‌మాన్‌ల‌కు ఈ పెర్ఫామెన్సులు అంకిత‌మిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ప్ర‌త్యేక అతిధిగా దుబాయ్ కింగ్‌ను ఇన్వ‌యిట్ చేసింది టీమ్‌. వేడుక‌లో ఒక్కో వీఐపీ టేబుల్ కోసం ఖ‌ర్చు ఆరు ల‌క్ష‌లు. స్థానికంగా 12000 ఉచిత పాస్‌ల‌ను పంపిణీ చేశారు. ఈ ఈవెంట్‌ను దుబాయ్‌లో ప‌లు షాపింగ్ మాల్స్ లో లైవ్ చేయ‌నున్నారు. అందుకోసం ఎల్ఈడీల్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.2కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌ని భారీ మొత్తానికి కొనుక్కునేందుకు టీవీ చానెళ్ల‌తో డీల్ మాట్లాడుతున్నారుట‌. ఇన్ని విశేషాలున్నాయ్‌.