2.ఓ డీల్ ఇంకా పూర్త‌వ్వ‌లేదా?

Saturday, October 6th, 2018, 12:01:57 AM IST


సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ – అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం `2.ఓ`. దాదాపు 500కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే ప్రీరిలీజ్ బిజినెస్ అంతే కాస్ట్‌లీగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్‌కి హిందీ రిలీజ్ హ‌క్కుల క‌సం 100కోట్ల డీల్ కుదుర్చుకున్న లైకా బృందం ఇరుగు పొరుగు భాష‌ల డీల్స్‌ని పూర్తి చేసే ప‌నిలో ఉందిట‌.

హిందీ డీల్ త‌ర్వాత అతి పెద్ద డీల్ టాలీవుడ్‌లోనే సాగ‌నుంది. వాస్త‌వానికి తెలుగు రిలీజ్ హ‌క్కుల్ని ప్ర‌ఖ్యాత ఏషియ‌న్ ఫిలింస్ ఛేజిక్కించుకుంద‌ని గ‌తేడాది చెప్పుకున్నారు. కానీ సాంకేతిక కార‌ణాల‌తో అంత‌కంత‌కు వాయిదా ప‌డుతున్న కార‌ణంగా న‌మ్మ‌కం త‌గ్గి ఏషియ‌న్ సినిమాస్ తిరిగి ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి తీసుకుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే స‌గం అడ్వాన్స్‌ని లైకా సంస్థ ఏషియ‌న్ నారంగ్‌కి తిరిగి ఇచ్చేసింద‌న్న మాటా వినిపిస్తోంది. దీంతో తెలుగు రిలీజ్ ఇప్ప‌టికీ సందిగ్ధంలోనే ఉంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు గ‌త ఏడాది 400 కోట్ల బ‌డ్జెట్ చెప్పిన లైకా బృందం అది అమాంతం పెరిగి 540 కోట్ల‌కు చేరింద‌ని చెబుతోంది. ఒక‌సారి స్పాయిల్ అయిపోయిన మొత్తం వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ వ‌ర్క్‌ని రీవ‌ర్క్ చేయించ‌డంతో ఇలా త‌డిసిమోపెడైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే బిజినెస్ ప‌రంగానూ లెక్క‌లు పెద్ద‌గానే చెబుతున్నార‌ని తెలుస్తోంది.

అయితే తెలుగు రైట్స్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ తీసుకోలేదు. తీసుకునే ద‌మ్ము ఎవ‌రికి ఉంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. అప్ప‌ట్లో ఏషియ‌న్ సంస్థ 80 కోట్ల వ‌ర‌కూ బేర‌మాడింద‌ని, లైకా సంస్థ 100 కోట్ల‌కు త‌గ్గేది లేద‌ని భీష్మించుకుని కూచుంద‌ని చివ‌రికి డీల్ ఓకే అయ్యింద‌ని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మారిన కాన్వాసులో ఆ మొత్తం ఏమేర‌కు చేరుకుందోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మ‌రోసారి టాలీవుడ్ వ‌ర్గాల్లో మొద‌లైంది. ఈ న‌వంబ‌ర్‌లోనే 2.ఓ రిలీజ్‌కి రెడీ అవుతోంది కాబ‌ట్టి .. ఇక డీల్ ముగించాల్సిన సంద‌ర్భం ఇదేన‌న్న ముచ్చ‌టా వేడి పెంచుతోంది. మ‌రి ఇంత‌కీ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని తెలుగు వెర్ష‌న్ ఎవ‌రు కొనుక్కుంటారో చూడాలి.