2017లో రిలీజైన అత్యంత చెత్త సినిమా ఇదే!

Saturday, October 28th, 2017, 12:00:47 PM IST

టీవీ ఆన్ చేస్తే చాలు .. ఒక‌టే ఊద‌ర‌గొట్టుడు. జియోస్టార్మ్ .. జియోస్టార్మ్‌.. జియోస్టార్మ్‌. ఓవైపు వెబ్ ప్ర‌పంచంలో, మ‌రోవైపు టీవీ ప్ర‌పంచంలో ఎటు చూసినా ఈ సినిమా ప్ర‌చార‌చిత్రాలే. ట్రైల‌ర్లు ఓ రేంజులో ఉన్నాయి. భూమిని ఏదో సుడి తిప్పేస్తోంది. భ‌యాన‌క‌మైన సుడులు భూమండ‌లాన్ని.. ప్ర‌పంచ మాన‌వాళిని త‌న‌లో క‌లిపేసుకుని సుడి తిప్పేస్తోంది. ఆ తిప్పుడుకు ఏకంగా భారీ భ‌వంతులు కుప్ప‌కూలిపోతున్నాయ్‌. స‌ముద్రం జ‌నావాసాల‌పై విరుచుప‌డి భీభ‌త్సం చేసేస్తోంది. అయితే అలా ఎందుకు జ‌రిగింది? అంటే జియోస్టార్మ్‌. విశ్వ మాన‌వాళిని ఒక్క క్ష‌ణంలో క‌బ‌లించేసే మృత్యువు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొన్న 20వ తేదీన రిలీజైన ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ కూడా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఓవైపు టీవీల్లో మిరుమిట్లు గొలిపే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు.. మ‌రోవైపు ఆన్లైన్‌, సామాజిక మాధ్య‌మాల్లో ఊద‌ర‌గొట్టుడు చూసి ఈ సినిమా చూసేయాలి అనుకోని వారు ఉండ‌రు.

క‌ట్ చేస్తే.. ఈ సినిమా రిలీజైంది. స‌మీక్ష‌కులంతా ఆ స‌మ‌యం కోస‌మే వేచి చూశారు. రిలీజైన తొలిరోజు పెద‌వి విరుపులు.. చీవాట్లు.. చిర‌బుర‌లు.. ఈ ఏడాది ఇలాంటి చెత్త సినిమా చూడ‌నేలేదు.. 2017 లోనే అత్యంత డిజాస్ట‌ర్ మూవీని చూశానంటూ స‌మీక్ష‌కులు బుర్ర‌లు బాదుకున్నారు. అస‌లు క‌థా గ‌మ‌నం.. తీరుతెన్నులు లేని సినిమా తీశారు. అస‌లు వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ లాంటి ప్ర‌ఖ్యాత సంస్థ తీయాల్సిన సినిమాయేనా? పైగా 300 హీరో జెరార్డ్ బ‌ట్ల‌ర్ లాంటి టాప్ హీరో న‌టించాల్సిన సినిమాయేనా? అంటూ ఒక‌టే చీవాట్లు. ఇక ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు మామూలోడేం కాదు. డీన్ డేవ్‌లిన్ హాలీవుడ్‌లో చెప్పుకోద‌గ్గ బ్లాక్బ‌స్ట‌ర్ సినిమాలు తీశారు. దాదాపు 120 మిలియ‌న్ డాల‌ర్లు పెట్టుబ‌డితో వార్న‌ర్ సంస్థ ఓ డిజాస్ట‌ర్ తీసింది… ఛీ ఛీ అంటూ ఒక‌టే తిట్టేశారు విమ‌ర్శ‌కులు. ప్లీజ్ డునాట్ వాచ్ ! అంటూ ప్ర‌త్యేకించి ఎండింగ్ ట్యాగ్‌లైన్ ఇచ్చారంటే ఇది ఎంత చెత్త సినిమానో ఊహించ‌వ‌చ్చు. గ్లోబ‌ల్ వార్మింగ్ నేప‌థ్యంలో ప్ర‌మాద‌పుటంచున ఉన్న ఈ ప్ర‌పంచాన్ని కాపాడేందుకు 17 దేశాలు క‌నిపెట్టిన జియో శాటిలైట్ ఏం చేసింది? ఇక భూమ్మీద పెను విస్పోట‌నాల వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిణామం ఏంటి? అన్న‌ది ఈ సినిమాలో చూపించారు. ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌నే అయినా అంతే చెత్త‌గా తీశాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లోనే బోలెడంత ఆల‌స్యం. వాయిదాల ఫ‌ర్వంలో షూటింగ్ సాగ‌డ‌మే గాకుండా, మ‌ళ్లీ మ‌ళ్లీ రీషూట్లు చేయించింది వార్న‌ర్ బ్ర‌దర్స్ సంస్థ‌. ఇదంతా స‌రే.. అస‌లు సినిమా ఎలా ఉందో చూడాల‌న్న ఉత్సుక‌త మీలో ఉందా? అయితే.. పైర‌సీలో చూడ‌కుండా థియేట‌ర్ల‌లో సినిమా చూసి మీరే ఏదో ఒక నిర్ణ‌యం చెప్పండి ప్లీజ్‌!!