సెన్సషనల్ న్యూస్: తిరుమలగిరి లోని ఒకే ఇంట్లో 228 బోగస్ ఓట్లు!

Sunday, January 26th, 2020, 11:35:21 AM IST

జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇంటింటికి ఓటరు ధ్రువీకరణ ప్రచారం చేస్తున్నపుడు ఒక సంఘటన బయటపడింది. సికింద్రాబాద్ తిరుమలగిరి లోని ఒకే ఇంట్లో 228 బోగస్ ఓట్లు ఉన్నట్లుగా కనుక్కున్నారు. అయితే ఎలక్షన్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్ ఉపయోగించి వీటిని గుర్తించినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జి. శ్రావణ్ కుమార్ దీనిని రూపొందించారు. గతంలో కంటోన్మెంట్ లో ఎనిమిది వార్డుల్లో 2,167 నకిలీ ఓట్లు ఉన్నాయని ఈ అప్లికేషన్ ద్వారానే కనుక్కున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ జరుగుతూనే వున్నది, రాబోవు కంటోన్మెంట్ ఎన్నికల్లో భాగంగా దీనిని ప్రారంభించినట్లు తెలుస్తుంది.

అయితే తిరుమలగిరి లోని ఆర్టీఏ కార్యాలయం వెనుక ఉన్న చంద్రగిరి కాలనీలో 228 బోగస్ ఓట్లు కలిగి వున్న ఇంట్లో కేవలం నలుగురు మాత్రమే నివాసం ఉంటున్నారని తెలుస్తుంది. ఇంటి యజమాని ని ఈ విషయం గురించి ఆరా తీయగా, అంత పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు ఉన్నాయని, తనకు తెలీదని, ఆ ఓటర్లతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే ఈ అప్లికేషన్ డిజైన్ చేసినటువంటి శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొంతమంది సిట్టింగ్ సభ్యులు నిరంతరంగా గెలవడానికి ఈ ఫేక్ ఓట్లు కూడా కారణం కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ప్రజాస్వామ్య మరియు న్యాయమైన ఎన్నికలు సులభంగా జరిగేందుకు ఈ బోగస్ వోటర్లని గుర్తించి అన్ని వార్డుల్లో ఒకే రకమైన ఓటరు ధ్రువీకరణ కార్యక్రమంతో ముందుకెళతామని అన్నారు. అయితే అధికారులకి ఈ విషయాన్నీ చెప్పగా, పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.