హ్యాట్ట్రిక్ కొట్టనున్న పూజ?

Thursday, February 8th, 2018, 04:12:50 PM IST

నవ సామ్రాట్ నాగచైతన్య సరసన ఒక లైలా కోసం చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన నటి పూజ హెగ్డే, ఆతరువాత ముకుంద, దువ్వాడ జగన్నాధం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ తో చేసిన బాలీవుడ్ చిత్రం ‘మోహేన్ జెదరో’ ప్లాప్ కావడంతో అక్కడ ఆమె ఆశలు సన్నగిల్లాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సాక్ష్యం చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ భామ త్వరలో మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25 వ చిత్రం లో ఛాన్స్ కొట్టేసింది. అలానే త్వరలో ప్రారంభం కానున్న జూనియర్ యన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రం లో కూడా పూజానే తీసుకున్నట్లు సమాచారం.అయితే మొదట ఈ చిత్రం లో అను ఇమ్మానుయేల్ ని తీసుకుందామని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలో పూజ ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె మరొక భారీ ప్రాజెక్టును కూడా చేజిక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రం. ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం లో సాహూ చిత్రం లో నటిస్తున్న ప్రభాస్ తన తదుపరి కృష్ణం రాజు నిర్మాతగా జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం లో చేయనున్న విషయం తెలిసిందే. అయితే దీనిలో కూడా పూజానే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి వుంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే పూజ నక్క తోక తొక్కినట్లే అని, ఏకంగా ముగ్గురు బడా స్టార్స్ ప్రక్కన నటిస్తూ హాట్ట్రిక్ కొట్టినట్లే అని సినీ వర్గాలు అంటున్నాయి….