ప్ర‌తీకారేచ్ఛ‌: భ‌న్సాలీ త‌ల్లిగారిపై క‌ర్ణిసేన‌ల సినిమా?

Friday, January 26th, 2018, 10:14:59 AM IST

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ప‌ద్మావ‌త్‌` ఎన్నో వివాదాలు, అల్ల‌ర్ల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు నిన్న విడుద‌లై భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. దేశ‌, విదేశాల్లో ఈ చిత్రం క‌లెక్ష‌న్ల దుమ్ము దులుపుతోంది. వివాదాల వ‌ల్ల రికార్డుల్ని ట‌చ్ చేయ‌లేక‌పోయినా.. ఈ సినిమాకి ముందే వ‌చ్చిన పాజిటివ్ టాక్ వ‌ల్ల క‌లెక్ష‌న్ల సునామీ కొన‌సాగుతోంది. అయితే ఈ ఆనందోత్సాహాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆస్కార‌మే లేకుండా పోతోంది. భ‌న్సాలీని ఇప్ప‌టికీ రాజ్‌పుత్ క‌ర్ణిసేన‌లు వ‌దిలి పెట్ట‌లేదు. వెంట‌ప‌డి టార్చ‌ర్ చేస్తున్నారు. గ‌తంలో త‌ల తెస్తే కోటి అంటూ ప్ర‌క‌ట‌న చేసిన క‌ర్ణిసేన‌లు మ‌రోసారి అత‌డిపై ఎటాక్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

అయితే ఈసారి ఎటాక్ కాస్తంత కొత్త‌గా ఉంది. ఈసారి నిర‌స‌న టిట్ ఫ‌ర్ ట్యాట్ త‌ర‌హాలో సాగ‌నుంది. రాజ్‌పుత్‌లో త‌ల్లిగా భావించే ప‌ద్మావ‌తిపై సినిమా తీసిన భ‌న్సాలీపై క‌క్ష తీర్చుకునేందుకు ఏకంగా అత‌డి త‌ల్లి గారిపై సినిమా తీస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు చిత్తోర్‌ఘ‌ర్ జిల్లా క‌ర్ణిసేన‌ల అధ్య‌క్షుడు గోవింద్ సింగ్ మీడియా స‌మ‌క్షంలోనే ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. `లీలా కి లీలా` అనే టైటిల్ ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం క‌థ‌ను రెడీ చేస్తున్నాం.. అర‌వింద్ వ్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారని ప్ర‌క‌టించారు. 15రోజుల్లో ముహూర్తం చేసి, సంవ‌త్స‌రం లోపే సినిమాని రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. అయితే ఇదంతా భ‌న్సాలీపై ప్ర‌తీకారంతో చేస్తున్నారా? రాజ్‌పుత్‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ సినిమా ఉందా? అన్న టాక్ ప్ర‌జ‌ల్లో న‌డుస్తోంది.