లడ్డూ వేలంలో మతసామరస్యం

Monday, September 8th, 2014, 05:02:28 PM IST


వినాయక నవరాత్రులు ముగింపు దశకు చేరుకోవడంతో తొమ్మిదవ రోజైన సోమవారం నిమర్జనానికి అన్ని ప్రాంతాలలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ నవరాత్రుల్లో వినాయక లడ్డు వేలంపాట అన్నింట్లోను ముఖ్యమైన ఘటనగా భావించవచ్చు. మరి ఇంత విశిష్టమైన విశేషమైన వేలంపాటలో మతసామరస్యాన్ని ప్రభోధం చేసే ఒక సంఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే వరంగల్ లో గణనాధుని నిమర్జనం రోజున స్థానికంగా ఉన్న డాక్టర్స్ కాలనీ-2 వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేశ మండపంలో సోమవారం లడ్డూ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో అదే కాలనీకి చెందిన రియాజ్ అనే ముస్లిం పాల్గొని 51,786రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇక రియాజ్ లడ్డూను సొంతం చేసుకోవడం పట్ల ఆ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేలంపాటలో లడ్డూను గెలుచుకున్న రియాజ్ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టారు.