మహాభారతం ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పిన అమీర్ ఖాన్…

Tuesday, April 10th, 2018, 03:55:30 PM IST

సాధారణంగా చరిత్ర పైన సినిమాలు తీయాలంటే డైరెక్టర్ కి ఎంత అనుభవం, ఉండాలో చరిత్ర పై పట్టుకూడా అంతే ఉండాలి, అలాంటప్పుడే సినిమాపై పూర్తి బరోసా పెట్టుకొని ముందుకెళ్ళగలం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్ట్‌ను విరమించుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. గతేడాది తాను మహాభారతాన్ని తెరకెక్కిస్తానని, ఇందులో కర్ణుడు లేదా కృష్ణుడి పాత్రను పోషిస్తానని ఆమిర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పద్మావత్ సినిమాకు ఎదురైన కష్టాలు చూసిన తర్వాత మహాభారత్ ప్రాజెక్ట్ వదులుకుంటేనే మంచిదని ఆమిర్ ఆలోచనలో పడ్డాడట. పురాణాలు, చరిత్రపై సినిమాలు తీసి లేనిపోని వివాదాలను కొనితెచ్చుకోవడం ఎందుకని అనుకొనే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మహాభారత ప్రాజెక్ట్ చేపడితే కచ్చితంగా దానిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని అతను భావిస్తున్నాడు. ఈ మధ్యే రాణి పద్మిణిపై తెరకెక్కిన పద్మావత్ సినిమాను రాజ్‌పుత్‌లు ఎంతగా వ్యతిరేకించారో చూశాం. సుప్రీంకోర్టు చెప్పినా కూడా సినిమా ప్రదర్శన కొన్ని చోట్ల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టడం సరికాదని ఆమిర్ అనుకుంటున్నాడు.

మహాభారతాన్ని ఐదు భాగాలు తెరకెక్కిస్తానని ఆమిర్ గతేడాది చెప్పాడు. దీనికి ముకేశ్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరిస్తారనీ వార్తలు వచ్చాయి. అయితే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ఆమిర్ ప్రకటించినప్పుడే కొందరు వ్యతిరేకించారు. ఓ ముస్లిం అయిన ఆమిర్ ఎలా ఈ సినిమా తీస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమిర్.. తర్వాత ఏ ప్రాజెక్ట్‌కూ సైన్ చేయలేదు. కొన్నేళ్ల పాటు ఒకే ప్రాజెక్ట్‌కు అంకితం కావాల్సి ఉన్నందున మరో సినిమాను ఆమిర్ అంగీకరించలేదని అతని సన్నిహితులు చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ మహాభారతమేనని చాలా మంది అనుకున్నారు. మన రాజమౌళి కూడా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాజమౌళితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమిర్ కూడా గతంలో చెప్పాడు.

  •  
  •  
  •  
  •  

Comments