53 ఏళ్ల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న శివసేన..అయోమయంలో బీజేపీ

Friday, June 14th, 2019, 01:06:35 AM IST

మహారాష్ట్రలో శివసేన పార్టీ ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా చుట్టూ పక్కల రాష్ట్రాల్లో కూడా శివసేన గురించి చాలా మందికి తెలుసు. బాల్ థాకరే స్థాపించిన శివసేన పూర్తిగా హిందువాద పార్టీగా ముద్రపడింది. అదే విధంగా హిందూ భావలాజం ఎక్కువగా ఉండే బీజేపీ తో కలిసి దోస్తీ చేస్తూ శివాజీ కోటలో చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం ఉద్థవ్ థాకరే శివసేన అధ్యక్షుడిగా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకి సాగుతున్నారు. అయితే ఈ క్రమంలో శివసేన ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందని మాటలు వినిపిస్తున్నాయి.

అదేమిటంటే ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్థవ్ థాకరే కుమారుడు “ఆదిత్య థాకరే (28) ” ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు 53 ఏళ్ల శివసేన పార్టీ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా పార్టీ కి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ ఈ సారి భిన్నంగా ఆదిత్య థాకరే నిలబడే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆదిత్య థాకరే మహారాష్ట్ర లో పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం కృషిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేస్ గురించి ఆదిత్య థాకరేని అడిగితే ఏ నిర్ణయమైనా మా పార్టీ అధ్యక్షుడు ఉద్థవ్ థాకరే తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మహారాష్ట్ర లో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. బీజేపీ తరపు వ్యక్తి సీఎం అవుతూ ఉంటాడు, శివసేనకు ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తూ ఉంటారు, కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి తెరదించేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఉద్థవ్ థాకరే కి అమిత్ షా కి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రం ఇంకా తెలియరాలేదు.