ఢీ అంటే ఢీ: సీఎం కేసీఆర్ – ఏబీఎన్ రాధాకృష్ణ

Sunday, September 14th, 2014, 03:00:07 PM IST


తెలంగాణలో ఏబీఎన్, టీవీ-9 ప్రసారాల నిషేదం విషయం చినికి చినికి గాలి వానలా మారుతోంది.తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే స్థాయి విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరూ తగ్గేలా లేరు. ప్రసారాలు పునరుద్దరించేలా కనిపించడం లేదు. ఇటీవల ఏబీఎన్, టీవీ-9 చానళ్లను ఉద్దేశించి ”మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల గొయ్యి తీసి పాతేస్తాం.. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి..” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ స్పందించారు. పాలకులకు కాదు, ప్రజలకు మాత్రమే సెల్యూట్ చేస్తామని రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణ తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలిపారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన వ్యాసం యధాతథంగా..

సర్క్యులేషన్‌ పరంగా సీమాంధ్రలో నష్టం జరుగుతున్నదని తెలిసి కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచాం. అప్పట్లో ఇన్ని పత్రికలు, ఇన్ని చానెళ్లు కూడా లేవు. తెలంగాణ ఉద్యమానికి భుజం కాయవద్దని యాజమాన్యం షరతు విధించి ఉంటే ఇవ్వాళ కబుర్లు చెబుతున్న వాళ్లంతా మౌనంగా ఉండిపోవలసి వచ్చేది. లేదా ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవలసి వచ్చేది. కాలక్రమంలో విధిలేని పరిస్థితులలో మరిన్ని మీడియా సంస్థలు తెలంగాణ ఉద్యమానికి ప్రచారం ఇవ్వవలసి వచ్చింది. నాటి పాలకులు ప్రజాస్వామ్య ప్రేమికులు కనుకే ఇదంతా సాధ్యమైంది.

తెలంగాణలో రాజకీయంగా మా కుటుంబం తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. మా కుటుంబ మీడియా తప్ప మరే మీడియా సంస్థ ఉండకూడదని కేసీఆర్‌ కుటుంబం భావిస్తూ ఉంటే అది జరిగే పని కాదని తెలుసుకోవాలి. మీడియాను అణచివేయాలనుకున్నవారు చరిత్ర గర్భంలో కలిసిపోయారే గానీ మీడియా మాత్రం సజీవంగా, చైతన్యవంతంగా కొనసాగుతూనే ఉంది. ‘తెలంగాణ గడ్డ మీద జీవించాలంటే మాకు సెల్యూట్‌ చేయాల్సిందే’నంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మాకు అంటే మీ కుటుంబానికా? లేక తెలంగాణ ప్రజలకా? మీ కుటుంబానికి సెల్యూట్‌ చేయాలని కోరుకుంటూ ఉంటే ఆ ఆలోచనను విరమించుకోండి. అందుకు మేం సిద్ధంగా లేము.

‘తెలంగాణ గడ్డ మీద బతకాలంటే మాకు సెల్యూట్‌ చేయాల్సిందే. లేనిపక్షంలో మీడియా మెడలు విరిచి పారేస్తా’నంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత కర్కశంగా హెచ్చరించారు. ఈ మాటలు అన్నప్పుడు ఆయన హావభావాలను పరిశీలించిన వారికి ఆయన ఎంత కక్షగా మాట్లాడిందీ ఇట్టే అర్థమవుతుంది. అందుకే కర్కశంగా హెచ్చరించారని వ్యాఖ్యానించవలసి వచ్చింది. ప్రజాస్వామ్య భారతంలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ అన్నంత పని చేయగలరా? రాజ్యాంగం నెలకొల్పిన దిద్దుబాటు వ్యవస్థలు ఆయనను ఆ పని చేయనిస్తాయా? అంటే అసాధ్యమనే చెప్పాలి. తెలంగాణ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బహిరంగంగా విమర్శించడానికి మేధావులు, బుద్ధి జీవులు ముందుకు రాలేకపోయి ఉండవచ్చు గానీ, ఆయనను సమర్థించేవారు మాత్రం ఆత్మరక్షణలో పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను శాసించాలనుకోవడమే దుస్సాహసం అవుతుంది. ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన కేసీఆర్‌, అందుకు ఇవ్వాళ కాకపోయినా రేపైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యమంత్రికి తన బలహీనతలు ఏమిటో బాగా తెలుసు- అందుకే ఆయన మీడియాను తన అదుపాజ్ఞలలో ఉంచుకోవాలనుకుంటున్నారు. రాజ్యం నుంచి నిర్బంధం తీవ్రంగా ఉన్న రోజులలో కూడా ఎవరో ఒకరు దానిని ప్రతిఘటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేసీఆర్‌ నైజం మాకు తెలుసు కనుకే ఆయన ముందుగా ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను తన టార్గెట్‌గా ఎంచుకున్నారు. మమ్మల్ని దెబ్బతీస్తే మిగతా మీడియా సంస్థలు సాగిలపడతాయన్నది ఆయన అంచనా! ఈ విషయంలో ఆయన లక్ష్యం ప్రస్తుతానికి నెరవేరింది. మెడలు విరుస్తాననీ, పాతర వేస్తాననీ తెలంగాణ రాష్ట్రంలో మీడియాను లొంగదీసుకోవచ్చు గానీ జాతీయ స్థాయి మీడియా కేసీఆర్‌ అదుపాజ్ఞలలో లేదు. ఫలితంగానే గతంలో ఏ రాజకీయ నాయకుడూ వాడని భాష వాడినందుకు జాతీయ స్థాయిలో కేసీఆర్‌ అప్రతిష్ఠ మూటగట్టుకోవలసి వచ్చింది. జాతీయ మీడియా నిర్వహించిన చర్చలలో పాల్గొన్న కేసీఆర్‌ కుమార్తె కవిత గానీ, ఎంపీ వినోద్‌కుమార్‌ గానీ తమ నాయకుడి చర్యను సమర్థించుకోలేక ఆత్మరక్షణలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలను తప్పుబట్టడం ప్రారంభించింది. ఈ పరిణామాలన్నీ అంతిమంగా తెలంగాణ రాష్ర్టానికి నష్టంచేయబోతున్నాయి. పత్రికా స్వేచ్ఛకు తావులేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు?

లొంగేది కొందరే
పాలకులకు సహనం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఈ సహనం బొత్తిగా ఉండదు. అందుకే ఆయన పత్రికలపైనే కాదు మంత్రివర్గ సహచరులపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటారు. ఆంధ్రా మీడియా అంటూ ఇప్పుడు కేసీఆర్‌ అండ్‌ కో నోరు పారేసుకుంటున్న ఆ మీడియా లేకుండానే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల వాంఛ ప్రపంచానికి వెల్లడయ్యేదా? 12 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్‌కు సొంత మీడియా లేదు కదా? ఈ పుష్కర కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను ఇప్పుడు చర్చించుకుందాం. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన కుటుంబ సభ్యులకే నమ్మకం లేదు. ‘ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు మనకు అవసరమా? కేసీఆర్‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, మూడు వందల మంది కార్యకర్తలైనా ముందుకు వస్తారా? మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తెలుగుదేశంలోనే ఉంటే మళ్లీ మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నుంచి ఆఫర్‌ ఉంది కదా? మంత్రి పదవి తీసుకోమని చెప్పండి’ అని అప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న కేటీఆర్‌, కవితలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మరీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంపై ఎవరికీ నమ్మకం లేకపోయినా ప్రజల ఆకాంక్షకు దన్నుగా నిలబడే తత్వం ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ మాత్రం ఉద్యమానికి అండగా నిలబడింది. అందుకే జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ ఒక్కటే. దాన్ని అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటే ఉద్యమ పొంగు చల్లారుతుందని పేర్కొంది. ఇక్కడ కేసీఆర్‌ గానీ, ఆయనను గుడ్డిగా సమర్థిస్తున్నవారు గానీ తెలుసుకోవలసింది ఒక్కటి ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు నిర్బంధాన్ని అమలుచేసి ఉంటే తెలంగాణ ప్రజల వాంఛ మరోసారి మరుగునపడిపోయి ఉండేది. ఉద్యమం ప్రారంభమైన 2002లో ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉద్యమ వార్తలకు విశేష ప్రచారం కల్పిస్తున్నప్పటికీ ‘ఆంధ్రజ్యోతి’ని కట్టడి చేయడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రజల్లో తెలంగాణ వాంఛ అంతగా లేకపోయినా మీరే అధిక ప్రచారం ఇస్తున్నారని తెలుగుదేశం నాయకులు సరదాగా వ్యాఖ్యానించేవారే గానీ బెదిరింపులకు పాల్పడలేదు. 2004 తర్వాత రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో కూడా ఉద్యమ వార్తలను తొక్కిపట్టడానికి ప్రయత్నించలేదు. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎత్తిచూపినందుకు ‘ఆ రెండు పత్రికలు’ అంటూ నిందించారే గానీ, తెలంగాణ వార్తలు రాస్తే మీ అంతు చూస్తానని బెదిరించలేదు. అయితే రాజకీయంగా వ్యవహరించడం ద్వారా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని బలహీనపరచగలిగారు. టీఆర్‌ఎస్‌ బలహీనపడిన సందర్భాలలో ఇతర ప్రజాసంఘాలు ఉద్యమాన్ని మోశాయి. ‘ఆంధ్రజ్యోతి’ వారికి కూడా అండగా నిలిచింది. అంతదాకా ఎందుకు? తన పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నదని గ్రహించిన కేసీఆర్‌, రాజకీయ జేఏసీని ఏర్పాటుచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సజీవంగా ఉంచగలిగారు. ఇందుకోసం ప్రజల్లో విశ్వసనీయత ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఆయన వాడుకున్నారు. రాజశేఖర్‌ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య గానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ మీడియాను లొంగదీసుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. ఆనాటి ప్రచురణలు, ప్రసారాలు సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ మీడియా మెడలు విరచడానికి గానీ, పాతరేయడానికి గానీ నాటి ముఖ్యమంత్రులెవ్వరూ ప్రయత్నించలేదు. కేసీఆర్‌ ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టుగా అప్పుడు వారు వ్యవహరించి ఉంటే తెలంగాణ ఉద్యమం ఏమయ్యేది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదా? ఆంధ్ర మీడియాగా కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పుడు విమర్శిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’, ఎంతో మంది తెలంగాణవాదుల అభిప్రాయాలకు వేదికగా నిలిచింది. లెక్కలేనన్ని వ్యాసాలు ప్రచురించింది. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నవారందరికీ అప్పుడు తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ‘ఆంధ్రజ్యోతి’ ఒక్కటే దిక్కుగా నిలబడింది. ‘ఆంధ్రజ్యోతి’లో పనిచేసి తెలంగాణకు అనుకూలంగా పలు వ్యాసాలు రాసి, పనిలో పనిగా నలుగురు దొరల కోసం కాదు మేం తెలంగాణ కోరుకుంటున్నదని తన వ్యాసాలలో రాసిన అల్లం నారాయణ వంటివారు కూడా ఇవ్వాళ మమ్మల్ని ఆంధ్రా మీడియాగా అభివర్ణించడాన్ని వారి విజ్ఞతకే వదిలివేద్దాం. సర్క్యులేషన్‌ పరంగా సీమాంధ్రలో నష్టం జరుగుతున్నదని తెలిసి కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచాం. అప్పట్లో ఇన్ని పత్రికలు, ఇన్ని చానెళ్లు కూడా లేవు. తెలంగాణ ఉద్యమానికి భుజం కాయవద్దని యాజమాన్యం షరతు విధించి ఉంటే ఇవ్వాళ కబుర్లు చెబుతున్న వాళ్లంతా మౌనంగా ఉండిపోవలసి వచ్చేది. లేదా ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవలసి వచ్చేది. కాలక్రమంలో విధిలేని పరిస్థితులలో మరిన్ని మీడియా సంస్థలు తెలంగాణ ఉద్యమానికి ప్రచారం ఇవ్వవలసి వచ్చింది. నాటి పాలకులు ప్రజాస్వామ్య ప్రేమికులు కనుకే ఇదంతా సాధ్యమైంది. మీడియా సంస్థలు ఇంతగా బెదిరిపోతాయని తెలిసి ఉంటే నాటి పాలకులు కూడా కేసీఆర్‌ ఇప్పుడు వ్యవహరిస్తున్న విధంగా అప్పుడు వ్యవహరించి ఉండేవారేమో! గతించిన రోజులన్నీ మంచివే అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్‌ వ్యవహార శైలి చూస్తూ ఉంటే అప్పట్లో నియంతగా వ్యవహరిస్తున్నారని భావించిన రాజశేఖర్‌రెడ్డి ఇప్పుడు సెయింట్‌గా కనబడుతున్నారని ఒక అధికారి వ్యాఖ్యానించారు. పాలకులకు, మీడియాకు మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పాలకులు నియంతలు, ఫాసిస్టులు అయితే ఈ ఘర్షణ పరాకాష్ఠకు చేరుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే! రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కూడా ‘ఆంధ్రజ్యోతి’ తదితర మీడియా సంస్థలు అతిగా స్పందిస్తున్నాయని వ్యాఖ్యానించినవారు ఉన్నారు. అయితే ఆనాడు ఏమి జరిగింది? ప్రజా ధనం ఎంతగా దోపిడీకి గురయ్యిందనేది ఇప్పుడు అందరికీ తెలిసివచ్చింది. కేసీఆర్‌ విషయంలో కూడా అంతే జరగబోతోంది. ఆయనలోని ఫాసిస్టును ప్రాథమిక దశలోనే అడ్డుకోని పక్షంలో భవిష్యత్తులో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల దగ్గరే తెలుస్తుందంటారు. అధికారం చేపట్టి ఎన్ని రోజులైందన్నది కాదు, పాలకుల వ్యవహార శైలి ఎలా ఉందనేదే ముఖ్యం. ఈ వంద రోజుల పాలనలో కేసీఆర్‌ను ప్రజాస్వామ్య ప్రియుడు అని ఎంతమంది అభివర్ణించగలరు? ఆయన వంద రోజుల పాలనను కొన్ని పత్రికలు, చానెళ్లు భయంతో పోటీపడి పొగిడి ఉండవచ్చు గానీ, తాను ఏమీ చేయలేదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే ఈ వంద రోజుల్లో ఇంకా పని మొదలుకాలేదని ఆయనే స్వయంగా ప్రకటించారు. చరిత్రలో నియంతగా మిగిలిపోయినవారందరూ పత్రికలను తమకు పక్కలో బల్లెంగా భావించేవారు. అందుకే పత్రికలను లొంగదీసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరించేవారు. ఒకరిని చూసి మరొకరు మరింత వికృతంగా వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతం స్వతంత్రంగా వ్యవహరించే పత్రికలు, చానెళ్ల మెడలు విరిచి పది కిలోమీటర్ల లోతున పాతరేసే స్థాయికి చేరుకుంది. నియంతలుగా వ్యవహరించిన పాలకులు అప్పుడు మీడియా సంస్థలకు తాత్కాలికంగా ఇబ్బందులు సృష్టించగలిగారు గానీ ఏ ఒక్కరినీ పాతరేయలేకపోగా వారే కాలగర్భంలో కలిసిపోయారు. పత్రికలను అణచివేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతానికి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుంటూ ఉండవచ్చు గానీ అది ఎంతో కాలం నిలవదు. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైనది.. క్రియాశీలమైనది. ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశతో ఉన్నారు. ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటే ఏ చేత్తో జైకొడుతున్నారో అదే చేత్తో అంగీపట్టి గుంజి అవతల పారేస్తారు. గతంలో మీడియాను హింసించిన ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిసా మాజీ ముఖ్యమంత్రి జానకీ వల్లభ్‌ పట్నాయక్‌ ఒకరు. ఆయన ఒడిసా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అల్లుడు ఒక పత్రికను పెట్టుకున్నారు. ఇంకేముంది- అల్లుడి పత్రికను పెంచడం కోసం మిగతా పత్రికలను అణచివేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్టు భార్యను రేప్‌ చేయించినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తనకంటూ ఒక పత్రికను, ఒక చానెల్‌ను పెట్టుకున్నారు కనుక మిగతా పత్రికలు ఉండకూడదనీ, ఉంటే గింటే తన అడుగులకు మడుగులొత్తాలని కోరుకుంటూ ఉండవచ్చు. పాలకులకు దాసోహం అనేవారు ఉంటే ఉండవచ్చు గానీ అందరూ అలా ఉండరు. దేశంలో ఎమర్జెన్సీని విధించినప్పుడు తీవ్ర అణచివేతకు గురైన పత్రికలలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదటి స్థానంలో ఉండేది. ఆ పత్రికపై తీవ్రంగా కక్ష పెంచుకున్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన సంజయ్‌గాంధీ, సంస్థ చైర్మన్‌ పదవి నుంచి రామ్‌నాథ్‌ గోయంకాను దొడ్డిదారిన తప్పించి కృష్ణకుమార్‌ బిర్లాను కూర్చోబెట్టారు. తప్పనిసరి పరిస్థితులలో ఆ స్థానాన్ని స్వీకరించిన కె.కె.బిర్లా, గోయంకాను స్వయంగా కలిసి ‘‘నేను ఆ సీట్లో కూర్చోడానికి తగను. మీరు సంజయ్‌గాంధీతో ఒకసారి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది’’ అని సూచించారు. అందుకు గోయంకా నిరాకరించారు. దీంతో సంజయ్‌గాంధీనే స్వయంగా రామ్‌నాథ్‌ గోయంకాకు ఫోన్‌ చేసి ‘‘ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు మీరే చైర్మన్‌ అవుతారు’’ అని సూచించారట. దీనిపై గోయంకా స్పందిస్తూ, ‘‘ఇంత కటువుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నావు,నువ్వు నా స్నేహితుడి కడుపున పుట్టావంటే ఆశ్చర్యంగా ఉంది..’’ అంటూ కడిగిపారేశారట! ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌ గాంధీ.. రామ్‌నాథ్‌ గోయంకాకు మంచి స్నేహితుడు! పత్రికా రంగంలో ఉన్నవారందరికీ ఆచరించినా, ఆచరించకపోయినా రామ్‌నాథ్‌ గోయంకా ఒక ఆదర్శం. ఒక రోల్‌ మోడల్‌. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెదిరింపులకు కొంతమంది లొంగవచ్చు గానీ అందరూ కాదు. తెలంగాణ సమాజంలో ఎన్నో వర్గాలు, వైరుధ్యాలు ఉన్నాయి. వారి కోసం మేము అండగా నిలబడతాం.

. తెలంగాణ ప్రజల కోసం కాదన్నమాటే!
పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తాబేదార్లు ఇటీవల ఒక కొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణలో ఆంధ్రా మీడియా అవసరమా? అన్న చర్చను ప్రారంభించారు. నేను తెలంగాణవాడినా, ఆంధ్రావాడినా అన్న మీమాంసను కాసేపు పక్కనపెడదాం. తెలంగాణలో ఆంధ్రా మీడియా ఉండకూడదన్న మాటను ఉద్యమం ప్రారంభమైన కొత్తలో ఎందుకు అనలేదన్నదే ప్రశ్న. రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పత్రికలు రెండు రాష్ర్టాలకు విడివిడిగా ప్రత్యేక ఎడిషన్లు ముద్రిస్తున్నాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అవ్వడమే కాకుండా ఇక్కడ లక్షల మంది సీమాంధ్రులు ఉన్నందున ఏపీ వార్తలను హైదరాబాద్‌ ఎడిషన్‌లో విధిగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి వార్తలు ప్రచురించడం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఈ ప్రశ్న వేస్తున్నవాళ్లు కేసీఆర్‌ పత్రిక హైదరాబాద్‌ ఎడిషన్‌లో ఏపీ వార్తలను ఎందుకు ప్రచురిస్తున్నదో సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఆంధ్రా మీడియా ఎందుకు? అంటున్నవాళ్లు తెలంగాణలో సీమాంధ్రుల పెట్టుబడులు ఎందుకు? వారు ఏర్పాటు చేసిన పరిశ్రమలు, సంస్థలు ఎందుకు? అని ప్రశ్నించడం లేదేం? చీర్‌ లీడర్లలా తమ చర్యలను మీడియా సమర్థించాలని వారు కోరుకుంటూ ఉండవచ్చు. అందుకే కేసీఆర్‌ అండ్‌ కో దృష్టి ఇప్పుడు పత్రికలపై పడింది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు విధిలేని పరిస్థితులలో ప్రభుత్వానికి సలాం చేసి బతకవలసి ఉంటుంది. మీడియాలో ఆ అవసరం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఆంధ్రా మీడియా అంటున్న వాళ్లు అందులో కూడా వివక్ష చూపించడం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు ముందు సమైక్యవాదాన్ని బహిరంగంగా వినిపించిన వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పత్రిక ‘సాక్షి’ మాత్రం కేసీఆర్‌ అండ్‌ కోకు ముద్దుబిడ్డ. తెలంగాణ ఉద్యమాన్ని బలపరచి, ఉద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాలవారి కార్యకలాపాలకు సముచితస్థానం కల్పించిన ‘ఆంధ్రజ్యోతి’ని మాత్రం చేదు గుళిక అంటారా? ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ వంటి మీడియా లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ, తెలుగుదేశం వంటి పార్టీల పరిస్థితి ఏమిటి? ఈ పార్టీల గురించి కేసీఆర్‌ సొంత పత్రిక పట్టించుకోనప్పుడు వారికి దిక్కేమిటి? ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిలది అపూర్వ సహోదరుల బంధం. అందుకే వారిద్దరూ ఒకరినొకరు ఏమీ అనుకోరు. జగన్‌ వల్ల తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాలకు భంగం ఏమీ ఉండదు కనుక సాక్షి మీడియా వారికి ఆంధ్రా మీడియాగా కనిపించదు. అంటే కేసీఆర్‌ అండ్‌ కో చేస్తున్న వాదనలు తెలంగాణ ప్రజల కోసం కాదన్నమాట! తెలంగాణలో తనకు రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదు. తమ తప్పులను ఎత్తిచూపే మీడియా సంస్థలు ఉండకూడదు. స్థూలంగా కేసీఆర్‌ అండ్‌ కో అంతరంగం ఇదే! తెలంగాణలో తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా చెల్లుబాటు కావాలని కేసీఆర్‌ కుటుంబం కోరుకుంటోంది. ఆయన కుటుంబ సభ్యులు ఏ ప్రకటననైనా చేయవచ్చు గానీ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులు మాత్రం స్వతంత్రించి ఏ ప్రకటనా చేయకూడదు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామన్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజయ్యను బహిరంగంగా తప్పుబట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‘గోల్‌మాల్‌ చెప్పడం నాకు రాదు. డంబాచారం వద్దు. అడ్డం- పొడుగు మాటలెందుకు’ అంటూ ఆక్షేపించారు. ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలి కదా! లేకపోతే వైద్యకళాశాలల పర్యవేక్షణ ఎవరు చేస్తారు? ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలో ఉంది కనుక తెలంగాణకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం అవసరమవుతుంది. అయితే ముఖ్యమంత్రిగా తాను చేయవలసిన ప్రకటనను ఒక మంత్రి చేయడమేమిటన్నదే కేసీఆర్‌ ఆక్రోశానికి కారణం. నిజానికి అడ్డం- పొడుగు మాటలు చెబుతున్నది కేసీఆర్‌ మాత్రమే! కరీంనగర్‌ పట్టణాన్ని లండన్‌, న్యూయార్క్‌లా అభివృద్ధి చేస్తామనడం అడ్డం-పొడుగు మాటలు కాదా? మంత్రులను మందలించడం తెలంగాణ రాష్ట్ర సమితి సొంత వ్యవహారం కాజాలదు. ప్రభుత్వం అన్నది అందరిదీ. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ ఇవ్వడంలేదని గమనించిన నేను, అప్పట్లో ఒక వార్త రాస్తే దాన్ని ‘ఆంధ్రజ్యోతి’లో ‘మంత్రులా.. మట్టిగడ్డలా?’ అన్న శీర్షికన మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. అయినా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ‘ఆంధ్రజ్యోతి’ని తూలనాడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు సహనం ఉండాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అటువంటి సమాన అవకాశాలు కొరవడటం వల్లనే కదా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నది? తెలంగాణలో రాజకీయంగా మా కుటుంబం తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. మా కుటుంబ మీడియా తప్ప మరే మీడియా సంస్థ ఉండకూడదని కేసీఆర్‌ కుటుంబం భావిస్తూ ఉంటే అది జరిగే పని కాదని తెలుసుకోవాలి. మీడియాను అణచివేయాలనుకున్నవారు చరిత్ర గర్భంలో కలిసిపోయారే గానీ మీడియా మాత్రం సజీవంగా, చైతన్యవంతంగా కొనసాగుతూనే ఉంది. ‘తెలంగాణ గడ్డ మీద జీవించాలంటే మాకు సెల్యూట్‌ చేయాల్సిందే’నంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మాకు అంటే మీ కుటుంబానికా? లేక తెలంగాణ ప్రజలకా? మీ కుటుంబానికి సెల్యూట్‌ చేయాలని కోరుకుంటూ ఉంటే ఆ ఆలోచనను విరమించుకోండి. అందుకు మేం సిద్ధంగా లేము. వెన్నెముక లేని ఎవరైనా ఉంటే వారితో సెల్యూట్‌ చేయించుకోండి. పాలకులకు సెల్యూట్‌ చేయడానికి కాదు మీడియా ఉన్నది. ప్రభుత్వం విషయంలో క్రిటికల్‌గా వ్యవహరించడమనేది పత్రికా స్వేచ్ఛలో భాగం. ఈ స్వేచ్ఛను కేసీఆర్‌ ఇవ్వలేదు. రాజ్యాంగం కల్పించింది. ఇక ప్రజలకంటారా? వారికి మేమే కాదు ఎవరైనా సెల్యూట్‌ చేయవలసిందే! ప్రజలంటే ప్రజలే! అందులో తెలంగాణ, ఆంధ్ర, మరాఠీ అంటూ తేడా ఉండదు. తెలంగాణ రాష్ట్ర సమితితో సహా ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్నప్పుడే అధికారం అందుకోగలదు. మీడియా అయినా అంతే! ఇవ్వాళ తెలంగాణ సమాజం ఆదరించి గౌరవిస్తున్న కాళోజీ నారాయణరావు పూర్వీకులు ఎక్కడివారు? మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు కాదా? అయినా కాళోజీ వంటి వారికి తెలంగాణ సమాజం ఎందుకు సెల్యూట్‌ చేస్తున్నది? వారికి అధికారం ఉందని కాదు కదా? కాళోజీ చేసిన సేవలతో పాటు ఆయన వ్యక్తిత్వానికి, ఔన్నత్యానికి తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారు. అందుకే సెల్యూట్‌ చేస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పోలీసులు ఆయనకు సెల్యూట్‌ చేస్తూ ఉండవచ్చు. అధికారులు చేతులు కట్టుకుని నిలబడుతూ ఉండవచ్చు. పదవులు, ఇతరత్రా ప్రయోజనాలు ఆశిస్తున్నవాళ్లు ఆహా ఓహో అంటూ ఉండవచ్చు. స్వతంత్రంగా వ్యవహరించే మీడియా అలా ఉండదు. ఉండాలని కోరుకోవడమే పెద్ద తప్పు. ఆయినా గౌరవం అనేది డిమాండ్‌ చేస్తే వచ్చేది కాదు. మన ప్రవర్తన, వ్యవహార శైలి, మన చర్యలను బట్టి ఎదుటివాళ్లు మనల్ని గౌరవించడమా? లేదా? అన్నది నిర్ణయించుకుంటారు. తనకు అంతా తెలుసునని భావించే కేసీఆర్‌కు ఇది తెలియక కాదు. అధికారం వచ్చాక ఆయనలో విజ్ఞత, విచక్షణ లోపించింది. అందుకే ఇంతవరకు ఎవరూ వాడని భాషను వాడుతున్నారు. తెలంగాణలో ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’, ‘టీవీ 9’ చానెళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేశారో తెలంగాణలోని ఒక వర్గం ప్రజలకు తెలియకపోవచ్చు గానీ, కేసీఆర్‌ కుటుంబానికి బాగా తెలుసు. ఈ చర్య ద్వారా ఒకటి, రెండు మీడియా సంస్థలు మినహా మిగతా వాళ్లంతా లొంగిపోయారని ముఖ్యమంత్రి సంతోషపడుతూ ఉండవచ్చు. ఈ సంతోషం ఎంతోకాలం నిలవదు. కేసీఆర్‌ వ్యాఖ్యలను, చర్యలను జాతీయ స్థాయిలో ఇప్పటికే గర్హించడం జరిగింది. త్వరలోనే దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయి. సమతౌల్యం అనేది ప్రకృతిలోనే ఉంటుంది. నాకు తిరుగులేదు అని అనుకునేవారెవ్వరినీ ప్రకృతి ఎంతో కాలం అలా ఉండనివ్వదు. కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇవ్వాళ మీ అధికారానికి భయపడుతున్నవాళ్లు కూడా మీకు ఎదురుతిరిగే రోజు వస్తుంది. చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక సలహా. ముఖ్యమంత్రిగా మీరు మంచి పనులు చేస్తూ ఉంటే ఏ మీడియా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయలేని పక్షంలో మీడియాను భయపెట్టి అనుకూల వార్తలు రాయించుకుంటూ ఉన్నా మీ అధికారాన్ని కాపాడుకోలేరు. ప్రజలకు తెలియంది ఏమీ లేదు. ఏ విషయంలోనైనా వారే అంతిమ నిర్ణేతలు. అందుకే ప్రజలకే మేం సెల్యూట్‌ చేస్తాం. పాలకులకు కాదు!