ఆంధ్రా ప్రజల బాధలు మన సినిమా హీరోలకు అవసరం లేదా…?

Thursday, January 26th, 2017, 04:27:18 PM IST

police-vizag
2014 ఎన్నికల్లో మోడీ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసినప్పుడు ప్రతీ ప్రచార సభలోనూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను చూసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికారు. కానీ కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో కొన్నాళ్లుగా ప్రత్యేక హోదా కావాలని ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చల్లబరచడానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అంటూ తెలుగు ప్రజలను మరొకసారి మోసం చేసింది. తెలుగు దేశం పార్టీ కూడా ఈ ప్యాకేజీ కు మద్దతు పలికింది.

దీంతో అప్పటివరకు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల తరపున తాను పోరాడతానని ప్రజలకు ధీమా కల్పించారు. ఇప్పటికే మూడు బహిరంగ సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అయినా కేంద్రం నుండి కదలిక లేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో జల్లికట్టును నిషేదించిన కేంద్రాన్ని అక్కడి ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం దిగివచ్చి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ ఉద్యమాన్ని చూసిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలుగు ప్రజలు కూడా ఇలాంటి ఉద్యమం చేసి కేంద్రం మెడలు వంచాలని సూచించారు.

తెలుగు యువత కూడా ఇలాంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో చేపట్టాలని భావించి జనవరి 26న వైజాగ్ లో మౌన ప్రదర్శన చేపడుతున్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. దీంతో రాష్ట్రములో ప్రజలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ప్రజల నుండే కాకుండా సినిమా నటుల నుండి కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. తెలంగాణ కు చెందిన హీరో సంపూర్ణేష్ బాబు అందరికంటే ముందు మద్దతు తెలిపి శెభాష్ అనిపించుకున్నాడు. ఇంకా యువ హీరోలు సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, తనీష్, నిఖిల్ లాంటి వారు కూడా మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉద్యమానికి ఊపు తీసుకురావడానికి ట్వీట్స్ మీద ట్వీట్స్ పెడుతూ యువతను ఎంకరేజ్ చేశారు.

కానీ పోలీసులు మాత్రం మౌన ప్రదర్శనకు అనుమతి లేదని ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేసినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీనిని బేఖాతరు చేస్తూ యువత భారీ సంఖ్యలో వైజాగ్ చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు వైజాగ్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వైజాగ్ వెళ్లిన సంపూర్ణేష్ బాబు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

జల్లికట్టు లాంటి ఉద్యమంలో తమిళ టాప్ స్టార్లు అందరూ పాల్గొని ఆ ధర్నాలు విజయవంతం చేయడానికి దోహద పడ్డారు. కానీ మన దగ్గర మాత్రం కొంతమంది యువ హీరోలు ట్వీట్లు పెట్టి మద్దతు తెలిపారు తప్ప ఎవరూ ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్లు చేయడం తప్ప ప్రత్యక్షంగా అక్కడకు వెళ్ళలేదు. స్టార్ హీరో మహేష్ బాబు జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపి ఆంధ్రాలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపకపోవడం ఆయన అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేస్తుంది. మొత్తానికి తెలుగు సినిమా నటులు ఎలాంటి వారో మరొకసారి రుజువైంది.

జల్లికట్టు ఉద్యమానికి తలవంచిన కేంద్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి తలవంచుతుందా…? అనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కానీ తమిళనాడులో జరిగిన ఉద్యమానికి, ఇప్పుడు ఆంధ్రా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి ఒక తేడా మనం గమనించవచ్చు. అదేంటంటే… జల్లికట్టు ఉద్యమానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపింది. కానీ ఇక్కడ మన ప్రభుత్వం పూర్తి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాంతో మన తెలుగు వాళ్లలో ఉన్న ఐకమత్య లేమి మరొకసారి బయటపడింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ‘అమ్మ పెట్టా పెట్టదు… అడుక్కుని తిననివ్వదు’ అని మరొకసారి ప్రభుత్వ పెద్దలు రుజువు చేస్తున్నారు.