పవన్ కళ్యాణ్ పరువును నిజంగానే అభిమానులు మంటగలుపుతున్నారా..?

Saturday, January 21st, 2017, 12:09:10 PM IST

pawan-n
పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆయన అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. సినిమాలలోకి చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు తనకంటూ శాశ్వతంగా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మొదట్లో అందరూ పవన్ ను చిరంజీవి తమ్ముడు అనేవారు. ఇప్పుడు పవన్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగిపోయాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ అనే పార్టీని స్థాపించి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయనకు సినిమాల పరంగానే కాకుండా, రాజకీయాల పరంగా కూడా అభిమానులు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఆ ఫంక్షన్ ఎవరికి సంబంధించిందైనా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడకి వచ్చి రచ్చ చేయడం అలవాటైంది.

కొన్నాళ్ల క్రితం చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానుల కోసం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసారు మెగా హీరోలు. ఆ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ పిలిచినా హాజరు కాలేదు. ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా పవన్ అభిమానులు హల్ చల్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగేంద్రబాబు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడకుండా ‘జై పవర్ స్టార్’ అని అరుస్తూనే ఉన్నారు. దాంతో సహనం నశించిన నాగబాబు పవన్ అభిమానులకు క్లాస్ పీకారు. ‘పవన్ కళ్యాణ్ ను తాము ప్రతి ఫంక్షన్ కు పిలుస్తామని, కానీ పవన్ హాజరు కాడని, మీకు దమ్ముంటే పవన్ ఇంటికి వెళ్లి అడగాలని, అంతేకానీ ఇలా ఎక్కడపడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు అరిస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు.

మెగా ఫ్యామిలీలకు చెందిన ఫంక్షన్స్ అయితే పవన్ కళ్యాణ్ అని అరచిన అర్ధం ఉంటుంది. కానీ వాళ్ళు బయట హీరోల ఫంక్షన్స్ కు కూడా అటెండ్ అయ్యి ‘జై పవర్ స్టార్’ అని అరవడం వివాదాలకు దారి తీస్తుంది. దీనిపై ఇప్పటికే చాలా రగడ జరిగింది. మెగా ఫ్యామిలీలో ఒక హీరో అయిన అల్లు అర్జున్ ఒక సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా తాను పవన్ గురించి చెప్పను బ్రదర్ అని కామెంట్ చేసాడు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ఫై సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధమే మొదలుపెట్టారు. దానిపై అల్లు అర్జున్ ‘ఒక మనసు’ సినిమా ఆడియో వేదికలో క్లారిటీ ఇస్తూ… ‘ఎక్కడకి వెళ్లినా పవన్ కళ్యాణ్ అని అరవడం తప్పు అని, మన ఫంక్షన్స్ లో అరిస్తే అర్ధం చేసుకోవచ్చు అని, కానీ మీరు మాత్రం అందరి సినిమా వాళ్ళ ఫంక్షన్స్ కు వెళ్లి అరవడం బాలేదని, వాళ్లంతా మా సినిమా ఫంక్షన్స్ లో మీవాళ్ళ గోల ఏంటి అని అడుగుతున్నారని’ అల్లు అర్జున్ వాపోయారు. సినిమాలకు సంబంధించి ఫంక్షన్స్ చేసేటపుడు ఆ సినిమాకు సంబందించిన టెక్నీషియన్స్, నటులు ఆ సినిమా గురించి నాలుగు మాటలు చెప్పాలనుకుంటారని, కానీ మీరు మాత్రం ఎవరినీ మాట్లాడనీయకుండా జై పవర్ స్టార్ అని అరుస్తూనే ఉండడం తప్పని ఘాటుగానే మాట్లాడాడు అల్లు అర్జున్.

అంతకుముందు కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా ‘లోఫర్’ అనే సినిమా నిర్మించాడు. ఆ సినిమాకు సంబంధించిన ఒక ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యాడు. ఆ సినిమా ఫంక్షన్ లో కూడా పవన్ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఎవరు మాట్లాడుతున్నా వారికి అడ్డుపడి జై పవర్ స్టార్ అని అరుస్తూనే ఉన్నారు. ప్రభాస్ మాట్లాడేటప్పుడు కూడా జై పవర్ స్టార్ అనాలని పవన్ అభిమానులు రచ్చ చేశారు. దాంతో ప్రభాస్ ముఖంపై నవ్వు పులుముకుని నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ముక్తసరిగా బదులిచ్చాడు. కానీ ఆ సీన్ చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి వాళ్ళా అని ముక్కున వేలేసుకున్నారు. నిజంగా పవన్ అంటే ఇష్టం ఉన్నా ఆలా బలవంతంగా చెప్పించకూడదని అన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ మధ్య ఏం గొడవలు లేవు. ఇద్దరూ బాగానే ఉంటారు. కానీ ఆ ఫంక్షన్ కి ప్రభాస్ కేవలం సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాడు. అంతేకానీ వేరే హీరోల గురించి మాట్లాడడానికి కాదని కూడా పవన్ అభిమానులు తెలుసుకోకపోవడం గర్హనీయం.

తాజాగా కొన్ని రోజుల క్రిందట డేరింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వంగవీటి’ అనే సినిమా తీసాడు. ఎన్నో వివాదాలు మధ్య ఈ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కు కానీ, అతని అభిమానులకు కానీ అసలు సంబంధమే లేదు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ అభిమానులు అక్కడ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేసిన ఝాన్సీ పవన్ అభిమానుల గొడవతో విసిగిపోయి వాళ్లకు పెద్ద క్లాస్ తీసుకుంది. అయినా వాళ్ళు మాత్రం మారలేదు. ఆ తరువాత దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడేటపుడు కూడా ఆ అరుపులు అలాగే ఉండడంతో ఆయన చాలా అసహనంగా మాట్లాడారు. మొత్తానికి ఆ కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకునే కొంతమంది దిగ్విజయంగా రసాభస చేసి వదిలిపెట్టారు.

చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కూడా పవన్ అభిమానులు యధావిధిగా రచ్చ చేశారు. ఈ ఈవెంట్ కు పవన్ అటెండ్ అవుతాడా లేదా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. చిరంజీవి, నాగబాబు, రాంచరణ్ ఈ ఫంక్షన్ కు పవన్ పిలిచామని, పవన్ కు వీలయితే వస్తారని చెప్పారు. మొత్తానికి అందరూ అనుకున్నట్టే పవన్ ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు. అలాగే అందరు అనుకున్నట్టే పవన్ వీరాభిమానులు మాత్రం హాజరయ్యారు. ఇంక ఈ ఫంక్షన్ ఎలా జరిగిందో చెప్పేదేముంది. సాక్షాత్తు చిరంజీవి మాట్లాడుతుంటేనే పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు జనసేన జెండాలతో చేసిన హడావుడి చేయడం చూసిన ఎవరూ మరచిపోలేరు. చిరంజీవి కూడా పవన్ అభిమానులను వారించారు కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి ఆ సభ కూడా అలా ముగిసింది.

పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీకి నిలువెత్తు రూపం. ప్రజల కోసం ఆయన ఆలోచించినట్టు మరొకరు ఆలోచించారేమో. అలాంటి నాయకుడికి ఇలాంటి కొంతమంది అభిమానులు మచ్చ తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అలాంటి వాళ్లేనా అంటే అది కూడా తప్పే. పవన్ కళ్యాణ్ అభిమానులలో కొంతమంది మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ఇతర హీరోలను, వారి అభిమానులను రెచ్చగొట్టడమే వీరి పని. తమ హీరో మాత్రమే గొప్ప అంటూ వీళ్ళు చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. కానీ వాళ్ళు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల తమ అభిమాన హీరో పరువు పోతుందని వాళ్ళు గుర్తించడంలేదు. పవన్ కళ్యాణ్ గురించి బయట ఎవరిని అడిగినా పవన్ అంత మంచి మనిషి, హీరో, రాజాకీయ నాయకుడు ఉండడని చెప్తారు. కానీ పవన్ అభిమానుల గురించి మాట్లాడితే మాత్రం వారిలో చాలామంది దారి తప్పారని, పవన్ కళ్యాణ్ దారిలోకి తేవాలని చెప్తున్నారు. మరికొంతమంది పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఒక్కసారి తీవ్రంగా హెచ్చరించాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ లాంటి హీరో పరువు నిలబెట్టే పనులు చేయాలి కానీ ఇలాంటి పరువు తీసే పనులు చేయొద్దని చెప్తున్నారు.