టీనేజీ వయసులో ఉన్నపుడు తనపై పాశవికంగా లైంగిక వేదింపులకు పాల్పడ్డాడంటూ ప్రముఖ నటుడు, బాలాజీ టెలీఫిలింస్ వ్యవస్థాపక అధినేత జీతేంద్రపై తన కజిన్ ఒకరు ఆరోపించడం సంచలనమైంది. సదరు యువతి జీతేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసి, తన పేరును బహిర్గతం చేయవద్దని కోరింది. మిటు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఈ ఫిర్యాదు చేశానని, అప్పట్లో తాను కష్టకాలంలో ఉన్న వేళ తనపై అతడు లైంగిక దాడికి పాల్పడినా ఫిర్యాదు చేయలేకపోయానని సదరు యువతి తెలిపింది. అయితే జీతేంద్రపై ఈ ఆరోపణలు వెల్లువెత్తడం అభిమానుల్లో కల్లోలానికి కారణమైంది.
పోలీస్ విచారణ వేళ.. జీతేంద్ర లాయర్ రిజ్వాన్ స్పందిస్తూ … ఇవన్నీ ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణలు అని, పర్సనల్ ఎజెండా ఏదో ఒకటి ఉండి ఉంటుందని ప్రత్యారోపణలు చేశారు. జీతేంద్రపై ఆరోపణల్ని ఖండించారు. రాధారమైన ఆరోపణలు చేయడం శిక్షార్హం. ఆ తప్పు జరిగింది అనడానికి సాక్షాధారాలు చూపించాలని కౌంటర్ ప్రకటన వెలువరించారు. 1963లో రూపొందించిన చట్టం ప్రకారం.. ఎలాంటి ఫిర్యాదులు అయినా మూడేళ్ల లోపు ఇలాంటి కేసుల్లో విచారణ జరగాల్సి ఉంటుందని తెలిపారు. బిజినెస్ పరంగా దెబ్బ కొట్టేందుకే తన క్లయింటుపై ఇలాంటి ఆరోపణలు చేశారని లాయర్ రిజ్వాన్ చెబుతున్నారు.