మహానటి లో తన పాత్ర తొలగింపుపై నటి ఆవేదన !

Monday, May 14th, 2018, 10:24:29 PM IST

వెండితెర మహానటి సావిత్రి జీవిత గాథను మహానటి చిత్రం పేరుతో నాగ్ అశ్విన్ తెరకెక్కించి అద్భుత విజయం అందుకున్నారు. కాగా సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ని చూసిన ప్రతి ఒక్కరు అచ్చం సావిత్రిగారిలానే వుంది అంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంకదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మంచి సాంకేతిక విలువలతో రూపొందించారు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక పాత్ర చేసారని, ఎడిటింగ్ లో ఆ పాత్రను తీసేయడం జరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా నేడు మరొక నటి తన పాత్రను చిత్రం నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో జెమిని గణేశన్ స్నేహితురాలు పుష్పవల్లి పాత్రను తొలుత దర్శక నిర్మాతలు, తెరకెక్కించారు.

కాగా ఆ పాత్రను పోషించిన వర్ధమాన నటి బిందు చంద్రమౌళి తన పాత్రను చిత్రం లోనుండి తొలిగించారని తెలియగానే తన గుండె పగిలినంత పని అయింది అని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఒక చిత్ర నిర్మాణం జరిగే సమస్యలు తనకు తెలుసునని, దురదృష్టవశాత్తు తన గత చిత్రాలలో కూడా ఇలాగే జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. అయినప్పటికీ అంతటి మహానటి జ్ఞాపకంగా రూపొందిన ఈ చిత్రంలో నేను కూడా ఒక పాత్ర చేశాను అనేది తనకు చాలని, ప్రస్తుతం చిత్రం అందరి మన్ననలు పొందుతూ ఘనవిజయం దిశగా సాగుతుండడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. అంతే కాదు దర్శక నిర్మాతలు, ముఖ్యంగా నటుడు దుల్కర్ నటన విషయంలో అందించిన సహకారం మరువలేనిదని, మొత్తానికి తన పాత్ర చిత్రంలో వుందన్నట్లుగానే తాను భావిస్తున్నట్లు తెలిపారు……..