బీజేపీలో చేరిన సినీ నటీ హేమ.. స్టేజ్‌పై కామెడీ పండించింది..!

Tuesday, April 13th, 2021, 08:12:29 PM IST

సినీ నటీ హేమ బీజేపీలో చేరింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో హేమ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇలా కండువా కప్పుకుందో లేదో.. అప్పుడే ఆమె ఫుల్‌ కామెడీ పండించింది. ఏదో మాట్లాడుదామని ఇంకేదో మాట్లాడి నెటిజన్లకు అడ్డంగా బుక్కైంది. సభా వేదికపై మాట్లాడిన ఆమె బీజేపీ గురుంచి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికెత్తారు.

అయితే మన అన్న పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా చూసొచ్చానంటూ, ఆయన ఆడపిల్లలపై చెప్పిన డైలాగులు బాగున్నాయని ప్రశంసించారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న ఓ బీజేపీ నేత హేమ వద్దకు వచ్చి ప్రధాని గురించి మాట్లాడండి అంటూ చెవిలో చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో హేమ అతని వైపు కోపంగా ఓ లుక్కేశారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రధాని మోదీ గురుంచి మాట్లాడారు. అనంతరం తిరుపతి బీజేపీ అభ్యర్థి పేరు పలకడానికి ఇబ్బందిపడ్డారు. పక్కన ఉన్న వారు రత్నప్రభ అని చెప్పడంతో హేమ సీరియస్ అయ్యారు. నాకు అన్నీ తెలుసు మీరేమీ చెప్పొద్దంటూ నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చారు నన్ను మాట్లాడనివ్వండి అంటూ క్లాస్ పీకారు. అలా అంటూనే మరో మిస్టేక్ చేసి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీకి ఎన్నికా, లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా ఆమెకు క్లారిటీ లేదు. రత్నప్రభను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని మాట్లాడి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.