నన్ను లైంగికంగా వేధించారు: నివేదా పేతురాజ్

Monday, April 16th, 2018, 08:53:29 PM IST

కథువా, ఉన్నావ్‌ అత్యాచార కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యాచార నిందితులను ఉరితీయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ (ఆడవాళ్లపై లైంగిక వేధింపులు) ఉందంటూ చేస్తున్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే టాలీవుడ్‌కి చెందిన మహిళా ఆర్టిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి బయటపెడుతున్నారు. బాలీవుడ్‌కి చెందిన పలువురు నటీమణులు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని వెల్లడించారు.

తాజాగా దీనిపై నటి నివేదా పేతురాజ్‌ (మెంటల్‌ మదిలో ఫేం) స్పందించారు. చిన్నప్పుడు తనపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడిస్తూ సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే అయివుంటారని భావిస్తూ ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను. వారిలో నేనూ ఉన్నాను. ఐదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పను? ఆ వయసులో ఏం జరుగుతోందో కూడా తెలిసేది కాదు. తెలియని వారికంటే.. మన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిలోనే ఇలాంటి పనులకు పాల్పడే వారు ఉంటారు.’

‘అందరు తల్లిదండ్రులకు నా మనవి ఒక్కటే. ఈ విషయం గురించి పిల్లలతో మాట్లాడటం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఫర్వాలేదు. వారితో కూర్చుని చర్చించండి. వారికి రెండేళ్ల వయసు నుంచే జాగ్రత్తలు చెప్పండి. అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదని చెప్పండి. వారు ఇలాంటివి ఎప్పుడు ఎదుర్కొంటారో మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. వారు చదివే పాఠశాలల్లో, ట్యూషన్‌లో, చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతోందో మనం తెలుసుకోలేకపోవచ్చు. మీరు నివసిస్తున్న కాలనీలో వారికీ తెలియజేయండి. ఎందుకంటే ప్రతిసారీ పోలీసులను ఆశ్రయించలేం. పోలీసులు మనకు సాయపడతారు. కానీ ముందు మనల్ని మనం నమ్మాలి, ఎదుటివారికి మనపై నమ్మకం కలిగేలా చేయాలి. నాకు ఇప్పటికీ ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయం. ఎవర్ని చూసినా మంచివారు కాదేమోనన్న సందేహం కలుగుతుంటుంది. కానీ ఇలా చేయడం తప్పు. ఈ విషయంలో మగవారి సహకారం కూడా ఉంటే పిల్లల్ని, ఆడవాళ్లని వేధింపుల నుంచి కాపాడుకోగలుగుతాం’ అని వీడియోలో పేర్కొన్నారు.